ఏడుగురు చిన్నారుల సజీవదహనం
న్యూయార్క్: న్యూయార్క్‌లో బ్రూక్లిన్ కాలేజీ సమీపంలోని ఒక ఇంట్లో శనివారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చిన్నారులు సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. మరణించిన చిన్నారుల వయసు 5 నుంచి 15 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. విశ్రాంతిరోజు ఆహారపదార్థాలను వేడిగా ఉంచడానికి అనేక యూదు కుటుంబాలు స్టవ్‌లో ఒకబర్నర్ను వెలిగించి ఉంచుతారు. దీనివల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇంటి రెండు అంతస్తులలో మంటలు చెలరేగాయి.
ప్రమాద సమయంలో తల్లితో పాటు 15 ఏళ్ల కుమార్తె కిటికీలోంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. తీవ్రంగా కాలిన గాయాలైన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. వందకు పైగా అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. 'నాపిల్లలు ప్రమాదంలో ఉన్నారు రక్షించండి' అంటూ తల్లి కేకలేయడం తాను విన్నాని పొరుగునున్న నాట్ వెబర్ అనే వ్యక్తి విలేకర్లకు తెలిపారు. గత ఏడు సంవత్సరాల కాలంలో నగరంలో జరిగిన అతి పెద్ద విషాద అగ్నిప్రమాద సంఘటన ఇదని ఆయన అన్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పిల్లల తండ్రి ఇంట్లో లేరని అగ్నిమాపక అధికారులు తెలిపారు.