బీఈడీ పేరుతో బురిడీ !
- పశ్చిమ బెంగాల్ విద్యార్థుల నిరీక్షణ
- పదిరోజులుగా హాల్ టికెట్ల కోసం ఎదురుచూపులు
- మోసపోయామని తెలుసుకుని లబోదిబోమంటున్న విద్యార్థులు
వినుకొండ రూరల్: ఇతర రాష్ట్రాల నుంచి పట్టణంలో బీఈడీ చదువుతన్న విద్యార్థులు తాము మోసపోయామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పట్టణంలోని సెవెన్‌హిల్స్ బీఈడీ కళాశాల వద్ద పశ్చిమ బెంగాల్ విద్యార్థులు దాదాపు 150 మంది తమకు హాల్ టికెట్లు అందలేదని సోమవారం అర్ధరాత్రి కాలేజీ యాజమాన్యంతో ఘర్షణకు దిగారు.
కాలేజీ యాజమాన్యం తమకు సంబంధం లేదని చెప్పడంతో తమను బురిడీ కొట్టించిన ఏజెంట్ రాజీవ్ గైన్‌ను నిలదీశారు. పరీక్షలు రాసేందుకు వారం కిందట పట్టణానికి చేరుకున్న ఇతర రాష్ట్రాల విద్యార్థులు కళాశాల చుట్టూ ప్రదక్షిణలు చేసి మోసపోయిన విషయం గ్రహించారు. తమను నమ్మించి ఇక్కడ వరకూ తీసుకువచ్చిన ఏజెంట్లు రాజీవ్ గైన్, దేబాషిస్ బేరా, హఫీజిత్ రెహమాన్, సుబ్జిత్ ఛ టర్జీల్లో రాజీవ్ గైన్‌ను పట్టుకుని వినుకొండకు తీసుకొచ్చి ప్రశ్నించారు.
కాలేజీ వారు మోసం చేస్తున్నారని, మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తామని నచ్చజెప్పిన ఏజెంట్ వారితో తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. విలువైన ఏడాది వృథా అయిందన్న ఆవేదనతో కొంద రు విద్యార్థులు కళాశాల ముందే తిష్ట వేశారు. వారికి బాషా సమస్య ఉండటంతో వారి గోడు వినేనాథుడే కరువయ్యాడు. ఇప్పటికైనా ఆర్జేడీ స్థాయి లో విచారణ నిర్వహిస్తే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని పలువురు కోరుతున్నారు.
అన్నింటిదీ అదేదారి..!
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా ప్రతి కళాశాల 75 శాతం సీట్లు, యాజమాన్యం 25 శాతం సీట్లు భర్తీ చేస్తారు. మన రాష్ట్రంలో ప్రస్తుతం డీఎడ్‌కు ఉన్న డిమాండ్ బీఈడీకి లేకపోవటంతో దాదాపు 80 శాతం సీట్లు ఖాళీగానే ఉంటున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాల్లోని విద్యార్థుల కోసం ఏజెంట్ల ద్వారా వేటసాగిస్తున్నారు. పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లో బీఈడీకి డిమాండ్ ఉన్నా.. అందుకు తగ్గ కళాశాలలు అక్కడ లేకపోవడం ఇక్కడి కళాశాలలకు వరమైంది.
ఏజెంట్ల ద్వారా అక్కడి విద్యార్థులకు వలవేసి ఏడాదికి కేవలం రూ.70 వేలు చెల్లిస్తే చాలు.. కాలేజీకి రానవసరం లేదు.. పరీక్షల రోజు వచ్చి హాల్ టికెట్లు తీసుకుని పరీక్షలకు హాజరుకావొచ్చని ప్రచారం నిర్వహించి విద్యార్థులను ఆకర్షిస్తున్నారు. నాలుగేళ్ల నుంచి కళాశాలలకు ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్థులు వలసలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రంలో ఉన్న కళాశాలలు మాస్ కాపీయింగ్ చేయిస్తూ వారి నుంచి భారీ మొత్తంలోనే గుంజుకుంటున్నాయి. సీట్ల పరిమితికి మూడు నాలుగు రెట్ల మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులను చేర్చుకుని, కళాశా లల వారే సొంతంగా బోర్డ్ పరీక్షలు నిర్వహించి మోసగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
అభ్యర్థులను ఏజెంట్లే మోసం చేశారు..
దళారి ఏడుకొండలు, కరస్పాండెంట్, సెవెన్ హిల్స్ బీఈడీ కళాశాల ఈ విషయమై కళాశాల కరెస్పాండెంట్ దళారి ఏడుకొండలును వివరణ కోరగా అడ్మిషన్లు పొందిన విద్యార్థుందరికీ హాల్ టికెట్లు ఇచ్చినట్లు తెలిపారు. తమ కళాశాల విద్యార్థుల పరిమితి 100 అని, కానీ ఇప్పుడు పశ్చిమ బంగాల్ నుంచి ఒక్కసారిగా 150 మందికి పైగా వచ్చి హాల్ టికెట్లు ఇవ్వమని అడుగుతుంటే తమకే ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. ఇదంతా చూస్తుంటే ఏజెంట్లు అభ్యర్థులను మోసం చేసినట్లు తెలుస్తోందన్నారు. ఏజెంట్లతో మాట్లాడి అభ్యర్థుల నగదు వెనక్కి ఇవ్వాలని తామూ చెప్పినట్లు వివరించారు.