దేశంలో మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్న పాలకులు
•ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి
•ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు శివదాసన్
•ప్రభుత్వ విద్యపై నిర్లక్ష్యం తగదు : ఎమ్మెల్యే జూలకంటి
కోదాడటౌన్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం లౌకిక శక్తులపై ఆర్ఎస్ఎస్ భావజాలం రుద్దడానికి ప్రయత్నిస్తుందని, దేశానికి పెనుముప్పుగా మారిన మతోన్మాదాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు శివదాసన్ పిలుపునిచ్చారు. కోదాడలో జరుగుతున్న తొలి తెలంగాణ రాష్ర్ట మహాసభల్లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన ‘ఆట-పాట’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇటీవల దేశంలో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే ఆందోళన కలుగుతుందన్నారు.
సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలపై ప్రజలను చైతన్యం చేయటానికి హందీలో వచ్చిన పీకే సినిమాపై కొందరు దాడి చేయడం మతోన్మాదమేనని ఆరోపించారు. తమిళనాడులో పెరుమాళ మురుగన్, బంగ్లాదేశ్‌లో తస్లీమా నస్రీన్, శ్రీలంకలో తమిళులపై జరుగుతున్న దాడుల్లో కూడా మతోన్మాద భావజాలం ఉందని, ఇది భారతదేశానికి పెనుముప్పుగా మారే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వినాయకుడి విగ్రహం పెడతామనడం తగదని, దీని వల్ల అనవసర సమస్యలు వస్తాయన్నారు. విద్యారంగంలో కూడా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనిని విద్యార్థులు మూకుమ్మడిగా వ్యతిరేకించాలని, సమసమాజ స్థాపనకు నడుంబిగించాలని కోరారు. విద్యార్థులకు, యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు పాలక ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు.
విద్యార్థులు, విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఎస్ఎఫ్ఐ రాజీలేని పోరాటం చేస్తుందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో అందెసత్యం, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు శోభన్, రాష్ట్ర కార్యదర్శి సాంబశివ, జిల్లా అధ్యక్షుడు మల్లం మహేశ్, నాయకులు కోట రమేష్, నర్సింహారావు, కోట్ల అశోక్‌రెడ్డి, సీపీఎం నాయకులు ముల్కలపల్లి రాములు, జుట్టుకొండ బసవయ్య, కుక్కడపు ప్రసాద్, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.