సౌదీ వెళ్లేందుకు మనవరాలి కిడ్నాప్
బహదూర్‌పురా: సౌదీ వెళ్లేందుకు మనవరాలిని కిడ్నాప్ చేసి రైల్వే స్టేషన్లో విక్రయించేందుకు యత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పురానీహవేలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. కిషన్‌బాగ్ నజంనగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ డానిష్, షాహిన్ బేగం దంపతులు. వీరికి కుమార్తె సాదియా. ఈ నెల 26న చాక్లెట్ తెచ్చుకునేందుకు సాదియా సమీపంలోని దుకాణానికి వెళ్లింది. అదే అదనుగా ఆమెకు వరుసకు తాతయ్య వసీం ఖాన్ సాదియాను తీసుకుని నాంపల్లి రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. సౌదీకి వెళ్లేందుకు తనకు రూ.50 వేలు అవసరం ఉండటంతో చిన్నారి సాదియాను రైల్వే స్టేషన్లో అమ్మకానికి పెట్టాడు. అయితే ఎవరూ చిన్నారిని కొనేందుకు ముందుకు రాకపోవడంతో ఆమెను చిత్తూరుకు వెళుతున్న ట్రైన్లో వదిలేసి వచ్చేశాడు.
సాదియా కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బహదూర్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఫిర్యాదు సమయంలో వసీం ఖాన్ కూడా వారితో పాటే ఉండటం గమనార్హం. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా వసీం ఖాన్ చిన్నారని ఎత్తుకెళుతున్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. దీంతో తెల్లవారుజామున 5 గంటలకు చిత్తూరులో ట్రైన్ బోగిలో పరిశీలించగా చిన్నారి లేకపోవడంతో రైల్వే పోలీసులను ఆరా తీశారు. ఉదయమే బాలికను రైల్వే పోలీసులు సికింద్రాబాద్‌లోని శిశువు విహార్‌కు తరలించినట్లు తెలిపారు. వారు బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడు వసీం ఖాన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.