క్రేజ్‌కు క్రేజు! క్యాష్కు క్యాష్!
‘దిల్వాలే’ సినిమాలో హైలైట్ ఎవరు? అంటే టక్కున వచ్చే సమాధానం షారుక్ ఖాన్-కాజోల్. ఇప్పటివరకూ వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు ఆరు. కానీ ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’లో ఈ జంట మధ్య పండిన కెమిస్ట్రీ , ఆ సినిమా చేసిన మాయ మాత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి వస్తున్న చిత్రం ‘దిల్వాలే’. ఈ నెల 18న రిలీజ్ కానున్న ఈ సినిమా మీద అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా గురించి ఆసక్తికరమైన అంశాలు మీ కోసం...
* శాటిలైట్ హక్కులు 60 కోట్లు!
* ఆడియో రైట్స్19 కోట్లు!
* 22 ఏళ్ల క్రితం ‘బాజీగర్’ కోసం తొలిసారి జతకట్టారు షారుక్ ఖాన్, కాజోల్. ఆ చిత్రంతోనే జంట బాగుందనిపించుకున్నారు. ఇక, ఈ ఇద్దరూ జంటగా నటించిన చిత్రాల్లో ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’కి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ చిత్రంలో ఇద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. ఇప్పటివరకూ అరడజను చిత్రాల్లో జంటగా నటించి, తమ కెమిస్ట్రీతో ప్రేక్షకులను మాయ చేశారు. అందుకే షారుక్, కాజోల్ ఓ చిత్రంలో జంటగా నటిస్తున్నారంటే ఆ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటాయి. తాజా చిత్రం ‘దిల్వాలే’పై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు.
* ఐదేళ్ల క్రితం షారుక్ సరసన ‘మై నేమ్ ఈజ్ ఖాన్’లో నటించిన కాజోల్ ఆ తర్వాత ఈ హీరోగారితో జతకట్టిన చిత్రం ‘దిల్వాలే’. వాస్తవానికి చిత్రదర్శకుడు రోహిత్‌శెట్టి ఈ చిత్రం గురించి చెప్పినప్పుడు, ఎక్కువ శాతం షూటింగ్ విదేశాల్లో ఉండటంవల్ల కాజోల్ చేయకూడదనుకున్నారు. కానీ, కాజోల్ కూతురు నైసా ‘మమ్మీ.. నువ్వీ సినిమా కచ్చితంగా చేయాల్సిందే. ఎక్కువ సినిమాల్లో నువ్వు ఏడవడం చూశాను. ఈ సినిమాలో కామెడీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, నువ్వు నవ్వడం చూడాలి’ అనడంతో కాజోల్ నవ్వుతూ ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
* ఇది రొమాంటిక్ యాక్షన్ కామెడీ మూవీ. ఇందులో షారుక్ ‘కార్ మాడిఫైర్’గా చేశారు. అండర్ కరెంట్‌లో గ్యాంగ్‌స్టర్ అని సమాచారం. షారుక్ తమ్ముడిగా వరుణ్ ధావన్ నటించారు. వరుణ్‌కు జోడీగా కృతీసన న్ నటించగా, మరో కీలక పాత్రను బొమన్ ఇరానీ చేశారు.
* షారుక్, కాజోల్‌ల సూపర్ హిట్ మూవీ ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ (డీడీఎల్‌జె)లో ట్రైన్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలిచింది. ఆ సీక్వెన్స్‌ని ఆదర్శంగా తీసుకుని పలువురు దర్శకులు ఆ తరహా సన్నివేశాన్ని తమ చిత్రాల్లో జోడించారు. ‘దిల్వాలే’లో కూడా ‘డీడీఎల్‌జె’ తరహా ట్రైన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు రోహిత్. మరి.. ఈ సీక్వెన్స్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
* గత నెల 9న విడుదలైన ఈ ప్రచార చిత్రానికి అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పటివరకూ దాదాపు కోటీ 70 లక్షల మంది ట్రైలర్‌ను వీక్షించారు.
* ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ నిర్మించారు. హిట్ పెయిర్ షారుక్, కాజోల్ జంటగా నటించిన చిత్రం కావడంతో పలు ప్రముఖ టీవీ ఛానల్స్ శాటిలైట్ హక్కులు దక్కించుకోవడానికి పోటీ పడ్డాయి. ఈ పోటీని నిర్మాత చక్కగా క్యాష్ చేసుకున్నారు. ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఏకంగా రూ. 60 కోట్లకు శాటిలైట్ హక్కులు సొంతం చేసుకుందని సమాచారం. ఇప్పటివరకూ ఏ చిత్రానికి ఇంత ధర పలకలేదని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
* మ్యూజిక్ రైట్స్ పరంగా కూడా రెడ్ చిల్లీస్కి భారీ మొత్తమే దక్కిందట. సోనీ మ్యూజిక్ సంస్థ ఆడియో హక్కులను 19 కోట్ల రూపాయలకు చేజిక్కించుకుందని భోగట్టా.
* ఈ చిత్రంలోని ‘గేరువా...’ ప్రోమో సాంగ్‌ను ముంబైలోని మరాఠా మందిర్‌లో విడుదల చేశారు. ‘డీడీఎల్జే’ ఇక్కడే 20 ఏళ్ల పాటు ఆడిన విషయం తెలిసిందే. ఈ పాటను ఐస్‌ల్యాండ్‌లో చిత్రీకరించారు. మైనస్ డిగ్రీల చలిలో షారుక్-కాజోల్ మధ్య ఏడు రోజుల పాటు తీశారు. ఈ పాట మొత్తం బ్లూ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటుందట. ఈ పాటకు సంబంధించిన ఓ దృశ్యంలో ఒక ధ్వంసమైన విమానం కనిపిస్తుంది. అది సెట్ అని ప్రోమో చూసినవాళ్లు భావించారు. కానీ అది నిజమైన విమానమే అట. ఐస్‌ల్యాండ్‌లో జరిగిన ఓ ప్రమాదంలో ధ్వంసమైన విమానం అది. ఆ త ర్వాత దాన్ని ఓ టూరిస్ట్ స్పాట్‌గా ఆ దేశ ప్రభుత్వం అభివృద్ధి చేసింది.
* రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న సినిమా అంటే ఫుల్ ఆఫ్ యాక్షన్ సీన్స్‌ను అభిమానులు ఆశిస్తారు. దానికి తగ్గట్టుగా ఈ సినిమాలో నాలుగు పోరాట సన్నివేశాలు ఉంటాయట. ఈ పోరాట సన్నివేశాలను దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ సిటీ, మార్షియస్, అబుదబి దేశాల్లో చిత్రీకరించారు.
* చాలా కాలం తర్వాత హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకున్న షారుక్ చిత్రమిదే. కీలక సన్నివేశాలను హైదరాబాద్‌లోని ఆర్ఎఫ్సీ, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు
* షూటింగ్ సమయంలో షారుక్‌ఖాన్ మోకాలికి గాయమైంది. ఆ గాయం నుంచి కోలుకోవడానికి రోహిత్‌శెట్టి ఓ సైకిల్ కొనిచ్చారట. మోకాలి గాయం తగ్గడానికి షారుక్ సైక్లింగ్ చేసేవారట. ఆ సైకిల్‌నే ఈ చిత్రంలోని ఓ షాట్లో వాడారు.
* ఈ చిత్రం నిర్మాణ వ్యయం సుమారు వంద కోట్లు అని సమాచారం. ఏ విషయంలోనూ రాజీపడకుండా గౌరీ ఈ చిత్రాన్ని నిర్మించారట.
* ‘దిల్వాలే’ విడుదల రోజే రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకొనె, ప్రియాంకా చోప్రా నటించిన ‘బాజీరావ్ మస్తానీ’ విడుదల కానుంది. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. విచిత్రం ఏమిటంటే 2007 నవంబరు 7న షారుక్‌ఖాన్ ‘ఓం శాంతి ఓం’, సంజయ్‌లీలా భన్సాలీ ‘సావరియా’ ఒకే రోజున విడుదలయ్యాయి. ‘సావరియా’ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడితే, ‘ఓం శాంతి ఓం’ సూపర్‌హిట్‌గా నిలిచింది. మరి.. ఈసారి ఏం జరుగుతుందో?