చిన్న పిల్లల బిస్కెట్లలో తవుడు కల్తీ ఆయిల్స్
విజయవాడ: కల్తీకి అదీ ఇదనే తేడా ఏమి లేదు. చివరకు చిన్నపిల్లలు తినే బిస్కెట్లలో సైతం తవుడు, కల్తీ ఆయిల్స్‌ని కలిపి డబ్బులు దండుకుంటున్నారు కల్తీరాయుళ్లు. నగరంలో ఆదివారం మరో కల్తీ భాగోతాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు బయటపెట్టారు. స్థానిక గద్దెపూర్ణచంద్రరావు కాలనీలోని శంకర్ బిస్కెట్ కంపెనీలో జరుగుతున్న కల్తీ వ్యాపారం గుట్టు రట్టు చేశారు.
చిన్న పిల్లలు తినే బిస్కెట్లు, సున్నుండలలో తవుడు కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. పశువులకు వాడే దాణా, పుచ్చిపోయిన మినపపప్పు, కల్తీ ఆయిల్స్‌తో తినుబండారాలు తయారు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఇవి తింటే పిల్లలకు పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. పెద్ద ఎత్తున కల్తీ బయటకు వచ్చినప్పటికి అసలు ఎవరు కల్తీకి కారణమనేది బయట పడటం లేదు.