ఎడతెరిపిలేని వర్షాలతో భారీ నష్టం
రాయచూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో ఇటీవల ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాల కారణంగా భారీగా నష్టం వాటిల్లిందని, దీంతో సహాయ పనుల కోసం జిల్లా యంత్రాంగానికి తాత్కాలికంగా రూ.50 లక్షలు విడుదల చేశామని జిల్లా ఇన్చార్జ్, రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి డాక్టర్ శరణ ప్రకాష్ పాటిల్ తెలిపారు. ఆయన శుక్రవారం తాలూకాలోని జే.మల్లాపురంలో విలేకరులతో మాట్లాడారు. ఎడతెగని వర్షాల వల్ల జిల్లాలో రూ.17 కోట్ల మేర నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేశామన్నారు. ఎంత మేర నష్టం జరిగిందని అధికారులు అధ్యయనం చేస్తున్నారన్నారు.
సంబంధిత అధికారుల నుంచి జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక అందుతుందన్నారు. జిల్లా పంచాయతీకి సంబంధించి రూ.8.15 లక్షల నష్టం వాటిల్లిందన్నారు. వర్షాల వల్ల జిల్లాలో 104 ఇళ్లు కూలిపోయినట్లు సమాచారం ఉందన్నారు. ఈ విషయంలో కూడా మరింతగా అధ్యయనం జరుగుతోందన్నారు. పూర్తి వివరాలు అందిన వెంటనే బాధితులకు ఆర్థిక సహాయం అందించే ప్రక్రియ చేపడుతామన్నారు. వర్షాల వల్ల జిల్లా వ్యాప్తంగా రోడ్లన్ని దెబ్బతిన్నాయని, త్వరలో మరమ్మతు పనులు చేపడతామన్నారు.
రాజీవ్‌గాంధీ గృహ వసతి సంస్థ అధికారులతో చర్చించి కూలిన ఇళ్లకు పరిహారం అందించడంపై తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. వర్షాల వల్ల ఎక్కువ నష్టం జరగకుండా సకాలంలో చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి సూచిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ప్రతాప్‌గౌడ పాటిల్, జెడ్పీ ఉపాధ్యక్షుడు శరణప్ప, ఏసీ మంజుశ్రీ, కాంగ్రెస్ అధ్యక్షుడు వసంతకుమార్, కాంగ్రెస్ ప్రముఖులు శివమూర్తి, శాంతప్ప, అమరేగౌడ, తాయణ్ణ నాయక్ పాల్గొన్నారు.