యా అల్లా.. ఏమిటీ ఘోరం!
అమ్మానాన్న.. చెల్లీతమ్ముళ్లకు టాటా చెప్పి.. వణుకుపుట్టిస్తోన్న ఉదయపు చలిలోనే రిక్షాలో స్కూల్ కు బయలుదేరారు 10 మంది చిన్నారులు. సందులో నుంచి మెయిన్ రోడ్డుపైకి వచ్చాక కుదుపులు లేకుండా సాఫీగా సాగుతున్న ఆ చిన్నారుల ప్రయాణం.. రోడ్డుకు అడ్డంగా పడిఉన్న ట్యాంకర్ దగ్గర ఆగింది. ఏం జరిరిగి ఉంటుందోనని ఊహించేలోపే అగ్గిరాజుకోవటం, భారీ శబ్ధంతో ట్యాంకర్ పేలిపోవడం.. మంటల్లో ఆరుగురు చిన్నారులు సహా 13 మంది సజీవదహనమైపోవడం క్షణాల్లో జరిగిపోయింది.
పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ షేక్ పూరాలో బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పదుల మందిని పొట్టనపెట్టుకుంది. మొదట ఓ ఎస్సై, కానిస్టేబుళ్లు ప్రయాణిస్తున్నకారు.. ఎదురుగా వచ్చిన గ్యాస్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్ కూడా బోల్తాకొట్టి, కొద్ది సేపటికే పేలిపోయింది. ఆ సమయంలో ట్యాంకర్ పక్కనుంచి బైక్ రిక్షాలో స్కూలుకు వెళుతోన్న చిన్నారులు సహా 13 మంది సజీవ దహనం అయ్యారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
దట్టమైన పొగమంచువల్లే ఎస్సై కారు డ్రైవర్ గ్యాస్ ట్యాంకర్ ను గమనించలేకపోయాడని, పొగమంచువల్లే రోడ్డుపై పడిఉన్న ట్యాంకర్ ను రిక్షా డ్రైవర్ గుర్తించలేకపోయాడని జిల్లా అత్యవసర అధికారి ఆజం చెప్పారు. పేలుడుతో భారీగా ఎగిసిపడ్డ మంటలను ఫైరింజన్లతో ఆర్పేశామని, ఆంబులెన్సుల్లో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, గాయపడ్డ 20 మందిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తుచేస్తున్నట్లు వెల్లడించారు.