అంధకారంలో తండాలు
మనూరు, న్యూస్‌లైన్: శేరిదామర్‌గిద్ద పంచాయతీ పరిధిలోని గోప్యానాయక్, గట్టుమీది తండాలు అంధకారంలో మగ్గుతున్నాయి. 20 రోజులుగా విద్యుత్ సరఫరా జరగడంలేదని తండావాసులు శుక్రవారం ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. మూడు తండాలకు కలిపి బిక్యానాయక్ తండాలో ఒకే సింగిల్‌ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఉండటంవల్ల లోడ్ ఎక్కువై మాటిమాటికి ట్రిప్ అవుతుందన్నారు. దీంతో బిక్యానాయక్ తండావాసులు తమ తండాలకు విద్యుత్‌ను నిలిపి వేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరవై రోజులుగా అంధకారంలో మగ్గుతున్నామని వారు వాపోతున్నారు. అధికారుల ఇప్పటికైనా స్పందించి మరో సింగిల్‌ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. ఈ విషయాన్ని ట్రాన్స్‌కో ఏఈ అశోక్‌రెడ్డి ద ృష్టికి తీసుకెళ్లగా సమస్య తన దృష్టికి రాలేదని, పరిశీలించి పరిష్కరిస్తానని పేర్కొన్నారు.