సెలబస్: ఈ చిత్రలేఖనం శివశక్తిమయం
శివశక్తి దత్తా అంటే సినిమా రచయితగా, దర్శకునిగానే చాలామందికి తెలుసు. జానకి రాముడు, నారి నారి నడుమ మురారి, జగదేక వీరుడు - అతిలోక సుందరి లాంటి ఎన్నో సినిమాలకు కథా విభాగంలో పని చేసినవారు దత్తా. ‘రాజన్న’లో ‘అమ్మా... అవనీ...’, ‘ఛత్రపతి’లో ‘అగ్నిస్థలన సందిగ్దరపు’లాంటి పాటలు రాసిందీ ఆయనే. ‘అర్థాంగి’, ‘చంద్రహాస్’లాంటి సినిమాలు డెరైక్ట్ కూడా చేశారు. ఇదంతా ఆయన వన్‌సైడ్.
శివశక్తి దత్తా పొయిట్రీ రాస్తారు. స్టోరీలు అల్లుతారు. మ్యూజిక్‌లో మేటి. పెయింటింగ్‌లో కింగ్. ‘గంగావతారం’ అనే కావ్యానికి కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ నుంచి ప్రశంసలందుకోవడం మాటలా మరి! ‘యువ’ మాసపత్రికలో ఆయన రాసిన ‘హంస మంజీరాలు’ సీరియల్ అప్పట్లో సూపర్‌హిట్. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, సంస్కృతం, ఇంగ్లిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. పాట్లాడగలరు. హార్మోనియం,
సితార్ వాయిస్తారు. పాటలు కంపోజ్ చేస్తారు.
ఇవన్నీ కాదు... అసలాయన వేసిన పెయింటింగ్స్ చూస్తే
కళ్లు చెదిరిపోతాయ్. ‘వావ్’ అనకుండా ఉండటం అసాధ్యం.
పురాణ పురుషులు... యుద్ధ వీరులు... దేవుళ్లూ దేవతలూ... ఆ కుంచెతో జీవం పొందాల్సిందే. ఛత్రపతి శివాజి, వెంకటేశ్వర స్వామి, పద్మావతీ అమ్మవారు, పద్మనాభ స్వామి, విఘ్నేశ్వరుడు, తిరుమల టెంపుల్... అబ్బో ఒక్కో పెయింటింగూ ఐ ఫీస్టే.
ఇప్పుడాయన వయసు 81 ఏళ్లు. ఇప్పటికీ చిత్రలేఖనంలో యంగ్త‘రంగే’!
- శివశక్తి దత్తా