చెప్పుల తిప్పలతో పెళ్లిలో భారీ విధ్వంసం
మగ పెళ్లి వారి చెప్పులు దాచి, డబ్బులు వసూలుచేయడం ఉత్తరాదిలో ఆడపెళ్లివారికి అలవాటు. ఇది చాలా సరదా కార్యక్రమం. కానీ రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ జిల్లాలోని రాయ్ సింగ్ నగర్ లో ఒక పెళ్లిలో ఇదే తంతు బారీ ఘర్షణలకు, విధ్వంసానికి దారి తీసింది. ఆఖరికి పెళ్లే ఆగిపోయింది.
పెళ్లి కూతురు వర్గానికి చెందిన వారు మగ పెళ్లి వారి చెప్పులు దాచేశారు. ముందు మగపెళ్లివారు అటూ ఇటూ వెతుక్కున్నారు. వ్యంగ్యాలు, వెటకారాలు అనుకున్నారు. అవి నెమ్మదిగా వెక్కిరింతలకు దారి తీసింది. కొద్ది సేపటికే మాటా మాటా పెరిగింది. ఆ తరువాత బాహాబాహీ, ముష్టాముష్టీ మొదలైంది. చివరికి రాళ్లు విసురుకుని, కర్రలతో దాడులు చేయడం దాకా వెళ్లింది. ఇదంతా రెండు రంగట పాటు సాగింది.
ఈ సంఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి తీవ్రంగా ఉంది. చివరికి ఎవరో ఒకరు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తే, పెళ్లంటే ఇదంతా మామూలే అని పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదు.
ఆఖరికి ఎక్కడి దాకా వెళ్లిందంటే అమ్మాయి నాకు ఈ పెళ్లే వద్దు అని చెప్పేసింది.