ముంబై టెక్స్టైల్ వ్యాపారులకు ఏమైంది?
ముంబై: ఆర్థిక రాజధాని ముంబై నగరంలో టెక్స్టైల్ వ్యాపారుల ఆత్మహత్యలు కలవర పరుస్తున్నాయి. వ్యాపారంలో నష్టాలు రావడంతో మనస్తాపానికి గురైన వ్యాపార వేత్త శ్యామ్ సుందర్ కేజ్రీవాల్(54) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖాండివ్లి (ఈస్ట్) లోని ఒక ఎత్తైన టవర్ నుంచి దూకి ప్రాణాలు విడవడం ఆందోళన రేపింది.
దేశీయ వస్త్రవ్యాపారానికి పెట్టింది పేరైన ముంబైలో వస్త్ర పరిశ్రమను వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో వ్యాపారి శ్యామ్ సుందర్ కేజ్రీవాల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం కేజ్రీవాల్ తల్లి, భార్య , కుమారుడు(24) తో కలిసి థాకూర్ గ్రామంలో ఛాలెంజ్ టవర్‌లో నివసిస్తున్నారు. బోరివిలి వెళుతున్నానని చెప్పిఇంట్లోనుంచి బయలుదేరిన కేజ్రీవాల్ సమీపంలోని టవర్ పైకి ఎక్కి దూకేశారు. దీనికిముందు ‘టేక్ కేర్ ’ అంటూ కుమారుడికి వాట్సాప్ ద్వారా సందేశం పంపించారు. ఘటనా స్థలంలో తన మృతికి ఎవరూ కారణం కాదంటూ కేజ్రీవాల్ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.
కాగా ఒక నెలలోనే ఇదే ఏరియాలో ఇద్దరు వస్త్ర వ్యాపారవేత్తలు తనువు చాలించారు. జూలై 13న టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ బిజినెస్ మ్యాన్ మనీష్ మెహతా (54) 17వ అంతస్తులోని బెడ్ రూమ్ బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వ్యాపారంలో భారీ నష్టాలొచ్చాయని కుటుంబ సభ్యులతో వాపోవడం గమనార్హం.