ఆంధ్రప్రదేశ్ తొలి కేబినెట్ భేటీ నేడు
నేడు చంద్రబాబు రాక.. సింహాచలం సందర్శన తర్వాత భేటీకి
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మంత్రిమండలి తొలి సమావేశం నేడు విశాఖపట్నంలో జరగబోతోంది. ఉదయం 11.45 గంటలకు ప్రారంభమయ్యే రాష్ట్ర మంత్రిమండలి భేటీకి అనేక తర్జనభర్జనల అనంతరం వేదికను ఖరారుచేశారు. చివరాఖరుకు ఆంధ్రా యూనివర్సిటీలోని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హాల్‌కు వేదికను మార్చడంతో అక్కడ రాత్రికిరాత్రే అన్ని ఏర్పాట్లు ప్రారంభించారు. రాష్ట్ర కేబినెట్ తొలి భేటీకి మంత్రులంతా హాజరవుతుండటంతో భారీస్థాయిలో బందోబస్తు ఏర్పాటుచేశారు.
గురువారం నాటి మంత్రిమండలి సమావేశం కోసం పలువురు మంత్రులు బుధవారం సాయంత్రానికే విశాఖకు చేరుకున్నారు. అన్ని కీలక శాఖలకు చెందిన ఉన్నతాధికారులు సైతం హైదరాబాద్ నుంచి ఫైళ్లు తీసుకుని నగరానికి వచ్చారు. గురువారం ఉదయం విశాఖకు విమానంలో రానున్న సీఎం చంద్రబాబునాయుడు ముందుగా సింహాచలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించి ఆ తర్వాత కేబినెట్ భేటీకి హాజరవుతారు. ఆయన రాత్రి 7.30 గంటలకు విశాఖ నుంచి తిరిగి హైదరాబాద్ బయల్దేరి వెళ్తారని సమాచారం.