తొలి తెలుగు బాల నటుడు
మాస్టర్ రాము... మాస్టర్ కుందు... మాస్టర్ విశ్వం... మాస్టర్ హరికృష్ణ... మాస్టర్ బాలకృష్ణ... మాస్టర్ మహేశ్... ఇలా వందలాది మంది బాలనటుల్ని చూశాం మనం. అసలు ఈ బాలనటులకు ఆద్యుడెవరో తెలుసా? సింధూరి కృష్ణారావు. 1932 ఫిబ్రవరి 6న విడుదలైన మన తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’లో టైటిల్ రోల్ పోషించాడు. ఆ లెక్కన మన తొలి తెలుగు కథానాయకుడు కూడా అతనే. ఈ సినిమా చేసే సమయానికి కృష్ణారావు వయసు ఎనిమిదేళ్లు. ఖమ్మంలో సురభి కళాకారుల కుటుంబంలో పుట్టిన కృష్ణారావు రెండేళ్ల వయసు నుంచే సురభి నాటకాల్లో బాలకృష్ణుడిగా, కనకసేనుడిగా చిన్న చిన్న వేషాలు వేస్తుండేవాడు. దర్శకుడు హెచ్.ఎం.రెడ్డి ‘భక్త ప్రహ్లాద’ సినిమా కోసం సురభి బృందాన్ని సంప్రదించి అయిదుగురు పిల్లల్ని ఎంపిక చేసుకుని బొంబాయి తీసుకు వెళ్లారు. కృష్ణారావుతో ప్రహ్లాదుడి పాత్ర చేయించారు.
400 రూపాయలు పారితోషికం ఇచ్చారు. ఈ సినిమా తర్వాత కృష్ణారావు మళ్లీ సినిమా ఫీల్డ్కి వెళ్లలేదు. అప్పట్లో బొంబాయిలో మత కలహాలు చెలరేగడంతో ఇంట్లోవాళ్లు భయపడి తమ ఊరికి తీసుకువెళ్లిపోయారు. ఆ తర్వాత సురభి నాటక సమాజంలో హార్మోనిస్ట్గా కెరీర్ మొదలుపెట్టారు. అసలే పెద్ద కుటుంబం. చాలీచాలని పారితోషికాలు. దాంతో పోషణకు చాలా ఇబ్బందులు పడ్డారు. కొన్నాళ్లు తణుకు సమీపంలోని ఉండ్రాజవరంలో చిన్న కిరాణాకొట్టు పెట్టుకుని బతికారు. ఇంకొన్నాళ్లు కూలి పని కూడా చేశారు. చివరి దశలో గోదావరిఖని సురభి కంపెనీలో కేసియో ప్లేయర్గా పనిచేశారు. ఓ పత్రికలో వార్త చదివి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్వారు హైదరాబాద్ పిలిపించి ఆయన్ను సత్కరించారు. 2004 చివర్లో కృష్ణారావు కన్నుమూశారు. ఎవ్వరూ పట్టించుకోలేదు. అలా మన తొలి తెలుగు బాలనటుడి జీవితం అజ్ఞాతంగానే ముగిసిపోయింది.