కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి.. తండ్రి బాటలో తేజస్విని
కోలీవుడ్ దివంగత ప్రముఖ హాస్యనటుడు వివేక్ కుటుంబంలో శుభకార్యం జరిగింది. ఆయన కూతురు పెళ్లి చెన్నైలోని తన నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమం అతికొద్దిమంది సమక్షంలో జరిగింది. 2021 ఏప్రిల్‌లో గుండెపోటుతో వివేక్ మరణించిన విషయం తెలిసిందే. దాదాపు 300లకు పైగా చిత్రాల్లో నటించిన వివేక్. కోలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోలు రజనీకాంత్, సూర్య, అజిత్ చిత్రాల్లో హాస్యనటుడిగా మెప్పించారు. శివాజీ, సింగం, సింగం-2, విశ్వాసం,రఘువరన్ బీటెక్ చిత్రాలతో వివేక్ తెలుగువారికి కూడా సుపరిచితులయ్యారు.
మార్చి 28 వివేక్ కూతురు తేజస్విని ఏడు అడుగుల బంధంలోకి అడుగుపెట్టింది. భరత్ అనే యువకుడితో ఆమె వివాహం జరిగింది. చెన్నైలోని విరుగంబాక్కం వద్ద పద్మావతి నగర్లో ఉన్న వివేక్ నివాసంలోనే తేజస్విని వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుకలో ఇరు కుటుంబాలకు చెందిన అతికొద్ది సన్నిహితుల సమక్షంలో చాలా సింపుల్‌గా జరిగింది.
తండ్రి బాటలో తేజస్విని
వివేక్‌కు మొక్కలంటే చాలా ఇష్టం.. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకున్న వివేక్.. చెన్నై నగర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో మొక్కల నాటాడు. తన తండ్రికి ఇష్టమైన కార్యక్రమాన్ని ఇప్పుడు తేజస్విని కూడా కొనసాగిస్తుంది. తన తండ్రి కోరికను నిలబెడుతూ.. తన వంతుగా ప్రకృతిని కాపాడేందుకు మొక్కలు నాటినట్టు ఆవిడ తెలిపారు. అందులో భాగంగా వారి వివాహానికి హాజరైన అతిథిలకు తేజస్విని దంపతులిద్దరూ మొక్కలను పంపిణీ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తేజస్విని చేస్తున్న పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.