ఐటీ కారిడార్‌లో మెట్రో రయ్..రయ్
కొత్తగా 40 డీలక్స్ బస్సులు
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపిస్తున్న ఐటీ కారిడార్‌లో కొత్త బస్సులు పరుగులు తీయనున్నాయి. చక్కటి సిట్టింగ్ సదుపాయం, ఆకుపచ్చ, తెలుపు రంగు డిజైన్‌తో, పింక్ లైన్లతో పాటు అత్యాధునిక హంగులతో రూపొందించిన 40 మెట్రో డీలక్స్ బస్సులు ఈ వారంలో రోడ్డు ఎక్కనున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న బస్సులకు ఆదరణ లభించడంతో వివిధ మార్గాల్లో కొత్త బస్సులను నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది.
ప్రస్తుతం బస్ భవన్‌కు చేరుకున్న ఈ మెట్రోడీలక్స్‌లు ఆర్టీఏ నుంచి అనుమతి పొందిన వెంటనే సిటీ రోడ్లపైకి వస్తాయి. రేయింబ వళ్లు ఉద్యోగులు, సాఫ్ట్వేర్ నిపుణులు విధు లు నిర్వహించే ఐటీ సెక్టార్లలో రవాణా సదుపాయాల పెంపునకు గతేడాది గ్రేటర్ ఆర్టీసీ దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో నమోదైన ఒకటి, రెండు ఉదంతాల దృష్ట్యా మహిళా ఉద్యోగుల భద్రత, సురక్షితమైన ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకొని నగరం నలువైపుల నుంచి 415 బస్సులను ఐటీ మార్గాల్లో ప్రవేశపెట్టింది.
ఈ బస్సులు రోజూ 4246 ట్రిప్పులు తిరుగుతున్నాయి. సగటున 3 నుంచి 4 ల క్షల మంది ప్రయాణికులు వీటి సేవలను వినియోగించుకుంటున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్, నానక్నామ్గూడ, ఫైనాన్షియల్ సిటీ, హైటెక్‌సిటీ తదితర 600కు పైగా ఐటీ పరిశ్రమలు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో వివిధ కేటగిరీల్లో సుమారు 8 లక్షల మంది పని చేస్తున్నట్లు అంచనా. సెక్యూరిటీ గార్డులు మొదలు ఐటీ రంగ నిపుణుల వరకు ఐటీ కారిడార్లకు రాకపోకలు సాగిస్తున్నారు.
ట్యాక్సీలు, సొంత వాహనాలు, ఆటో తదితర వాహనాల్లో కొంతమంది రాకపోకలు సాగిస్తుండగా, మిగతా వారంతా ఆర్టీసీపై ఆధారపడుతున్నారు. మరోవైపు రాత్రి వేళల్లో ట్రిప్పుల సంఖ్యను పెంచడం వల్ల కూడా ప్రయాణికుల నుంచి ఆదరణ పెరిగింది. నగరవ్యాప్తంగా ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 65 నుంచి 67 శాతానికే పరిమితం కాగా ఐటీ కారిడార్లకు నడిచే బస్సుల్లో ఇది 70 -72 శాతం వరకు నమోదవుతున్నట్లు అధికారుల అంచనా.
ఆర్టీసీకి ఇది లాభదాయకమైన రేషియో కావడంతో తాజాగా కొత్త బస్సులను ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతం ఈసీఐఎల్, ఉప్పల్, సికింద్రాబాద్, కోఠి, వనస్థలిపురం, ఎన్జీవోస్ కాలనీ, ఎస్ఆర్నగర్ మైత్రీవనం, జీడిమెట్ల ప్రాంతాల నుంచి కొండాపూర్, వీబీఐటీ, వేవ్రాక్లకు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాణికులను మరింత ఆకట్టుకోనున్నాయి.