మేము ఎప్పటికీ ప్రతిపక్షంలోనే....యనమల!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తడబడ్డారు. తాము ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉంటామన్న ఆయన ఆ తర్వాత తన పొరపాటును సరిదిద్దుకున్నారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం చోటు చేసుకుంది. స్పీకర్గా కోడెల శివప్రసాదరావు ఎన్నిక అయిన సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ సభలో కేవలం రెండు పార్టీలు మాత్రమే ఉన్నాయని, ఒకటి అధికార పార్టీ, మరొకటి ప్రతిపక్షం అన్నారు.
అయితే మూడో పార్టీ బీజేపీ కూడా ఉందని కోడెల ఈ సందర్భంగా గుర్తు చేశారు. దానిపై జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ అయితే టీడీపీ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉందని, వారు ఇటువైపు వచ్చే వరకు పాలకపక్షంగానే పరిగణిస్తామని జగన్ అనడంతో సభలో నవ్వులు విరిశాయి.
దీనిపై యనమల స్పందిస్తూ ఎప్పటికీ తాము పాలకపక్షంలోనే ఉంటామని అనబోయి.. ప్రతిపక్షంలోనే ఉంటామని అన్నారు. ఆ తర్వాత వెంటనే తన పొరపాటును సద్దుకున్నారు. దీనిపై వైఎస్ జగన్ స్పందిస్తూ 1999 సంవత్సరంలో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు శాశ్వతంగా ప్రతిపక్షంలోనే ఉంటారని టీడీపీ నేతలు అన్నారని, అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. అధికారం అన్నది దేవుడు ఇస్తారని, ప్రజలు నిర్ణయిస్తారని జగన్ వ్యాఖ్యానించారు.