కొత్తవి ఖతర్నాక్..
పరిశోధకులు ఎప్పటికప్పుడు కొత్తరకం గ్యాడ్జెట్లను తయారుచేస్తున్నారు. మానవజీవితాల్ని మరింత సులభతరం చేసే లక్ష్యంతో వీటిని రూపొందిస్తున్నారు. వాటిలో కొన్ని మార్కెట్లోకి దూసుకొచ్చి విజయవంతమవుతున్నాయి. ఇలా ప్రతి సంవత్సరం అనేక కొత్త ఉత్పత్తులు మార్కెట్లో దూసుకొస్తున్నాయి. ఇటీవల వినియోగంలోకి వచ్చిన కొన్ని కొత్త గ్యాడ్జెట్ల గురించి తెలుసుకుందాం..
ఈగ్లూ..
ఇది కొత్తతరం ఎకోఫ్రెండ్లీ రూమ్ హీటర్. ఇప్పటికే పలురకాల హీటర్లు మార్కెట్లో ఉన్నప్పటికీ ఇది మరింత సమర్ధవంతంగా పనిచేస్తుంది. చాలా చిన్నగా అండం ఆకారంలో ఉండే ఈ హీటర్‌ను ఎక్కడికైనా మోసుకెళ్లొచ్చు. చిన్న క్యాండిల్తోనే పనిచేయడం దీని ప్రత్యేకత. క్యాండిల్స్ వెలిగినప్పుడు ఇది వేడిని విడుదల చేస్తుంది. తక్కువ శక్తి వినియోగంతోనే ఎక్కువ వేడిని అందిస్తుంది. మంచును సైతం కరిగించేంత వేడిని ఈగ్లూ కలిగి ఉంటుంది. విద్యార్థులు చలికాలంలో దీన్ని పక్కన పెట్టుకుని చదువుకోవచ్చని తయారీదారులు అంటున్నారు. దీన్ని వల్ల పర్యావరణానికి ఎలాంటి హానీ కలుగదు.
స్మార్ట్ యూనిట్..
ప్రయాణ సమయాల్లో సూట్‌కేసులు, బ్యాగుల నుంచి దొంగతనాల్ని నివారించేందుకు రూపొందిన పరికరమిది. విలువైన వస్తువులు ఉన్న బ్యాగ్‌లలో స్మార్ట్ యూనిట్‌ను ఉంచితే చాలు. ఎవరైనా మన అనుమతి లేకుండా వాటిని తెరవాలని చూసినా, ఇంకేదైనా సమస్య ఎదురైనా ఈ పరికరం వెంటనే స్మార్ట్‌ఫోన్‌కు సమాచారం అందిస్తుంది. పైగా ఆటోమేటిక్ స్విచ్ ఆన్, ఆఫ్ అవడం దీని ప్రత్యేకత. మీరు ఈ పరికరాన్ని బ్యాగ్‌లో వేయగానే ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. బయటికి తీయగానే ఆఫ్ అయిపోతుంది. ఇది స్పందించే వేగం కూడా ఎక్కువే.
కోబి..
బైక్ రైడింగ్కోసం ఉద్దేశించిన స్ట్రీట్ నేవిగేషన్ సిస్టమ్ కోబి. దీన్ని బైక్‌కు అమర్చుకుంటే ప్రయాణిస్తున్న ప్రదేశానికి సంబంధించిన వాతావరణం, గమ్య స్థానాలు, దగ్గరి దారులు వంటి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానమై ఉండే ఈ పరికరం సమాచారాన్ని ఫోన్‌కు చేరవేస్తుంది.
స్పిన్ రిమోట్..
కొత్త తరహా రిమోట్స్ని పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. అలా ఇటీవల ఆవిష్కరించిన రిమోట్లలో కొత్తది స్పిన్ రిమోట్. మనం ప్రస్తుతం వాడుతున్న రిమోట్స్ చాలా పెద్దవిగా ఉండి, రకరకాల బటన్స్ కలిగి ఉంటాయి. అయితే స్పిన్ రిమోట్ వాటికి భిన్నమైనది. గుండ్రంగా ఓ బంతిలాగా చేతిలో ఇమిడిపోయేలా ఉండే ఈ రిమోట్‌కు ఎలాంటి బటన్స్ ఉండవు. రిమోట్ యాంగిల్‌ను మార్చడం ద్వారానే దీన్ని వినియోగించవచ్చు. టి.విలు, ఎ.సి.లు, రూమ్ హీటర్లు, స్మార్ట్ఫోన్లు, మ్యూజికల్ గాడ్జెట్లువంటి వాటిని స్పిన్ రిమోట్‌తో ఆపరేట్ చేయవచ్చు.
జెన్ ఎగ్..
ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక రుగ్మతల్ని తగ్గించేం దుకు తోడ్పడే పరిక రం జెన్ ఎగ్. కోడిగు డ్డు ఆకారంలో ఉండే ఈ పరికరంలో కొన్ని ఔషధ మూలికలు ఉంటాయి. దీనితో శరీరంపై మసాజ్ చేసుకోవడం వల్ల మానసిక ఆందోళనలు దూరమవుతాయి. దీన్ని చేతితో నొక్కుతూ మసాజ్ చేసుకోవడం వల్ల అందులోని ఔషధాలు విడుదలై ఒత్తిడిని తగ్గిం చి మానసిక శక్తిని అందిస్తాయి. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లగలిగే వీలుంది కాబట్టి దీన్ని వినియోగించి ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
స్మార్ట్ ఇన్సోల్స్..
ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు రూపొందించిన స్మార్ట్ ఇన్సోల్ ఇది. షూలు ధరించినప్పుడు పాదాల రక్షణకు ఉపయోగించే ఇన్సోల్స్ని ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగించేలా తీర్చిదిద్దారు పరిశోధకులు. స్ట్రిడలైజర్ స్మార్ట్ ఇన్సోల్స్ అనే వీటిని షూలలో ధరించడం ద్వారా మీ ఆరోగ్య సమాచారం తెలుసుకోవచ్చు. వీటిని ధరించి పరుగెడుతున్నప్పుడు సంబంధిత సమాచారాన్ని స్మార్ట్‌ఫోన్‌కు అందిస్తాయి. రక్తప్రసరణ, ఎముకల పుష్టి వంటి సమాచారం తెలుసుకోవచ్చు.