ఎస్ఎన్ మహంతికి హైకోర్టులో ఊరట
సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు
సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో నిందితునిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్.ఎన్.మహంతికి హైకోర్టు ఊరటనిచ్చింది. సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి ఆయనకు మినహాయింపునిచ్చింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకూ ఇది అమలులో ఉంటుందని బుధవారం స్పష్టం చేసింది.
మహంతి కేంద్ర మానవ వనరులశాఖలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా డిప్యుటేషన్‌పై ఉన్నారు. తనపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని, ఈ కేసు తేలే వరకూ తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ మహంతి హైకోర్టులో పిటిషన్ వేశారు.