ఈ బుల్లితెర నటుడు నిజంగా శ్రీమంతుడే
ముంబై : పుట్టిన ఊరికి కొంతైనా మేలు చేయాలనుకున్నాడు. సొంత గడ్డ అభివృద్ధిని తన ఎదుగుదలగా భావించాడు. అనుకున్నదే తడవుగా సొంత ఊరిలో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనే ప్రముఖ హిందీ బుల్లితెర నటుడు గుర్మిత్ చౌదరి. సామాజిక సేవలలో ఎప్పుడూ ముందుండే ఇతడు ఇప్పుడు మరో అడుగు ముందుకేశాడు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న ఆలోచనతో ముందుగా తను పుట్టిన ఊరిని తీర్చిదిద్దాలని అనుకున్నాడు.
గుర్మిత్ పుట్టింది బీహార్‌లోని బాగల్పుర అనే గ్రామంలో. ఆ గ్రామం తీవ్రమైన కరెంట్ కోతలతో ఇబ్బంది పడుతోందని తెలుసుకున్న గుర్మిత్ వాటిని పరిష్కరించాలని అనుకున్నాడు. అక్కడ సోలార్ పానెళ్లను ఏర్పాటు చేసి విద్యుత్ సమస్యను కొంతైనా తీర్చాలని భావించాడు. కేవలం వనరులను సమకూర్చడంతోనే సరిపోదనుకున్న గుర్మిత్ ముందుగా ఆ ఊరి ప్రజలకు సోలార్ శక్తిని ఉపయోగించటంపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు.
ఈ సందర్భంగా గుర్మిత్ మాట్లాడుతూ.. సోలార్ పానెళ్ల ఆలోచన తనకు ఎప్పటి నుంచో ఉందని, వాతావరణ మార్పులపై వస్తున్న వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వాడినని తెలిపాడు. సౌర శక్తి వాడకం ఒకటే దీనికి మార్గంగా భావించానని పేర్కొన్నాడు. సహజ సిద్ధంగా లభించే వాటితో విద్యుత్‌ను ఉత్పత్తి చేయొచ్చని తన ఊరి వాళ్లకు తెలియదని చెప్పాడు. సొంత ఊరి నుంచి ఈ మంచి పని మొదలుపెట్టడం సంతోషంగా ఉందని, ఈ మంచి పనుల్ని మరింత ముందుకు తీసుకుపోతానని గుర్మిత్ వెల్లడించాడు.