ఆమె ఖరీదు లక్షా ఎనభైవేలు..!
బోథ్: భర్త చనిపోవడంతో ఓ మహిళను... అత్తింటివాళ్లు అమ్మేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. తమ కుమార్తె ఆచూకీ తెలపాలంటూ బాధితురాలి తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన లలిత అనే మహిళను ఆమె బావ (భర్త సోదరుడు) గుజరాత్లో అమ్మేసినట్లు తెలుస్తోంది. బోథ్ మండలం సొనాల గ్రామానికి చెందిన లలిత తల్లి గంగుబాయి, సోదరుడు జగదీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. లలితను మూడేళ్ల క్రితం నేరడిగొండ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన రమేశ్‌కిచ్చి పెళ్లి చేశారు. వీరికి కూతురు శివానీ పుట్టిన ఏడాదికే రమేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
దీంతో లలిత తన కూతురుతో కిష్టాపూర్‌లోని అత్తవారింట్లోనే ఉంటూ స్థానిక పాఠశాలలో రోజువారి వేతనం కింద అటెండర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. కాగా ఆమె బావ చౌహాన్ అర్జున్ తరచూ లలితను వేధించేవాడు. నెల రోజులుగా లలిత క్షేమ సమాచారాలు తెలియకపోవడంతో ఆమె సోదరుడు జగదీశ్ కిష్టాపూర్‌కు వెళ్లి విచారించాడు. తన సోదరిని ఇచ్చోడ గ్రామానికి చెందిన రేఖ, శారదలతో కలిసి చౌహాన్ అర్జున్ గుజరాత్లో అమ్మేసినట్లు తెలిసిందని జగదీశ్ పేర్కొన్నాడు.
ఇదే విషయం అర్జున్ను అడగగా తనకేమీ తెలియదని చెప్పగా మేనకోడలును తీసుకుని సొనాలకు వెళ్లానని తెలిపాడు. కాగా మంగళవారం రాత్రి మద్యం సేవించి సొనాలలోని తమ ఇంటికి వచ్చిన అర్జున్ పరుష పదజాలంతో దుర్భాషలాడి దాడికి యత్నించాడని జగదీశ్ వాపోయాడు. అదే రోజు సాయంత్రం తన సోదరి లలిత ఫోన్ చేసి తనను గుజరాత్లో రూ.లక్షా 80వేలకు అమ్మేశారని తెలిపినట్లు జగదీశ్ పేర్కొన్నాడు. దీంతో బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపాడు. కాగా ఓ మహిళను విక్రయించడం జిల్లాలో సంచలనానికి దారితీసింది.