సౌది ఔట్ జైలులో మగ్గుతున్న కార్మికులు
కంపెనీలు మూతపడటంతో రోడ్డున పడిన కార్మికులు
ఇంటికి వెళ్లలేక బయట పనులు చేస్తూ సౌది పోలీసులకు పట్టుబడిన కార్మికులు
ఒకే గదిలో వందలాది మంది కార్మికులను బందీలుగా ఉంచిన సౌది అధికారులు
మోర్తాడ్ : పొట్ట చేతపట్టుకుని ఉపాధి కోసం సౌదికి వెళ్లిన తెలుగు వారికి అక్కడ కూడా కష్టాలు తప్పడం లేదు. సౌదిలోని పలు కంపెనీలు మూతబడటంతో ఇళ్లకు చేరకుండా బయట పనులు చేస్తున్న కార్మికులను అక్కడి పోలీసులు అరెస్టు చేస్తున్నారు. వారం రోజుల నుంచి సౌదిలోని జెద్దా, రియాద్, కౌసిమ్, హాయిల్ ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలను నిర్వహించి వేలాది మంది కార్మికులను అరెస్టు చేశారు. వీరిని జెద్దా, రియాద్‌లలోని ఔట్ జైలులో బందీలుగా ఉంచారు. సౌది అరేబియాలోని ప్రముఖ కంపెనీల్లో ఒకటైన బిన్‌లాడెన్ కంపెనీ మూతబడగా వేలాది మంది కార్మికులు వీధినపడినారు. బిన్‌లాడెన్ కంపెనీ దారిలోనే సౌది ఓజర్ కంపెనీ కూడా ఇటీవల మూతపడింది. ఈ రెండు కంపెనీలు కన్స్ట్రక్షన్, హౌజ్ వైరింగ్, ఆయిల్, వివిధ రకాలైన ఉత్పత్తులు, సూపర్ మార్కెట్లు ఇతరత్రా వ్యాపారాలను నిర్వహిస్తున్నాయి. ఈ కంపెనీల్లో పని చేయడానికి దేశ విదేశాలకు చెందిన కార్మికులు సౌదిలో నివసిస్తున్నారు. ఇందులో ఎక్కువ మంది భారతీయులు కాగా అందులో తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్ జిల్లాలకు చెందిన వారు ఎక్కుగా ఉన్నారు. బిన్‌లాడెన్ కంపెనీ ఆరు నెలల కిందనే మూతబడగా, సౌది ఓజర్ కంపెనీ వారం రోజుల కింద లాకౌట్ చేయబడింది. వీసా పర్మిట్ ఉన్నా కంపెనీ మూతబడటంతో కార్మికులు వీధినపడినారు. అయితే సొంత గ్రామాలకు వస్తే ఉపాధి దొరకదని భావించిన కార్మికులు ఎంత కష్టమైనా సౌదిలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో సౌదిలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కార్మికులను గుర్తించి వారిని పట్టుకోవడం కోసం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సౌది ఓజర్ కంపెనీ లాకౌట్ ప్రకటించడంతో ఆ కంపెనీకి చెందిన కార్మికులు సొంత దేశాలకు వెళ్లిపోవాల్సి ఉందని సౌది అధికారులు ప్రకటించినట్లు అక్కడి రిసార్టులో మేనేజర్‌గా పని చేస్తున్న భీమ్‌గల్ వాసి పాలకుర్తి అజయ్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. సౌది అధికారుల హెచ్చరికలను ఖాతరు చేయని కార్మికులను పోలీసులు అరెస్టు చేస్తూ ఔట్ జైలులో నిర్బంధిస్తున్నారని తెలిపారు. ‘ ఔట్ జైలులో ఉన్న పెద్ద గదుల్లో వందల మందిని నిర్బంధిస్తున్నారు. వందల సంఖ్యలో కార్మికులు ఒక్కటే చోట ఉండటంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అంతేగాక ఔట్ జైలులో సరైన సౌకర్యాలు లేకపోవడంతో కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. ఔట్ జైలులో ఉన్న కార్మికుల సంఖ్యకు సరిపడేంత భోజన ఏర్పాట్లు లేవు, నీటి సౌకర్యం అంతంత మాత్రంగా ఉంది’. అంటూ పేర్కొన్నారు. భారత విదేశాంగ శాఖ అధికారులు స్పందించి కార్మికులను ఇళ్లకు చేర్పించే ప్రయత్నం చేయాలని పలువురు కోరుతున్నారు.