‘మహాకవి’ విశేషణం.. కాళిదాసుకే సార్థకం
–మహామహోపాధ్యాయ శ్రీరామశర్మ
‘కాళిదాసు శ్రౌతప్రతిభ’పై ప్రసంగం
రాజమహేంద్రవరం కల్చరల్ : సాహితీజగత్తులో కవులు ఎందరున్నా, ‘మహాకవి’ అన్న పదం ఒక్క కాళిదాసుకే అన్వయిస్తుందని మహామహోపాధ్యాయ, వేదభాష్యవిభూషణ డాక్టర్ చిర్రావూరి శ్రీరామశర్మ పేర్కొన్నారు. నన్నయ వాజ్ఞ్మయ వేదిక ఆధ్వర్యంలో సోమవారం ఆదిత్య మహిళా కళాశాల ఆడిటోరియంలో ‘కాళిదాసు శ్రౌతప్రతిభ’ అనే అంశంపై శ్రీరామశర్మ ప్రసంగించారు. ముందుగా తన గురువులను సంస్మరించారు. ఒక సెకను కాలపరిమాణాన్ని లక్షా40వేల విభాగాలుగా భారతీయ జ్యోతిషశాస్త్రం విడగొట్టగలిగిందన్నారు. లోకవ్యవహారంలో జయంతి అంటే పుట్టినరోజుగా, వర్ధంతి అంటే మరణించిన రోజుగా భావిస్తున్నారని, కానీ వర్ధంతి అంటే పుట్టినరోజుగా, జయంతి అంటే ఇహలోకయాత్రను చాలించిన రోజుగా పరిగణించాలన్నారు. భర్తృహరి నీతిశతకంలోని ‘జయంతి తే సుకృతినో రససిద్ధః కవీశ్వరః’ శ్లోకాన్ని ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. ఉపమా కాళిదాసస్య అంటారు, కాళిదాసు ఉపమాలంకార విశేషాలను తెలుసుకోవాలంటే, శాస్త్రపరిజ్ఞానం ఉండాలన్నారు. కాళిదాసు కావ్యసౌందర్యాలను వర్ణిస్తూ సజ్జనుల సంపాదన మేఘం వంటిది, నిరుపయుక్తంగా ఉన్న సముద్రజలాలను మేఘం సూర్యకిరణాల ద్వారా గ్రహించి, వర్షధారలు కురిపించి, పుడమిని సస్యశ్యామలం చేస్తుందన్నారు. షట్శాస్త్రాలను చదివినవారికి సైతం కాళిదాసు రచించిన ‘రఘువంశం’ ఆదిగా గల కావ్యాలను చదివితే సందేహాలు కలుగుతాయన్నారు. వేదాలలో వివరించిన యజ్ఞప్రక్రియను శ్రౌతమంటారని, సుదక్షిణాదేవి గర్భం ధరించడాన్ని శమీగర్భంలో ఉన్న అగ్నిహోత్రంగా కాళిదాసు పేర్కొన్నాడని, శమి అంటే భూమి, రావిచెట్టు అనే అర్థాలు ఉన్నాయని చెప్పారు. కాంతాసమ్మితంగా కాళిదాసు అద్భుతమైన శ్రౌతరహస్యాలను వివరించాడన్నారు.
తండ్రికి అసత్యదోషం అంటరాదనే రాముని వనవాసం
‘సాధారణంగా రామాయణం చెప్పుకునేటప్పుడు, శ్రీరాముడు పితృవాక్యాన్ని అనుసరించి అడవులకు తరలి వెళ్ళాడంటారు, ఇది సరైన అవగాహన కాదు, ‘నా మాట తోసిపుచ్చు, నన్ను బంధించి అయినా యువరాజ పదవిని చేపట్టమని దశరథుడు చెప్పినా శ్రీరాముడు ఈ మాటను అనుసరించడు, తండ్రికి అసత్యదోషం రాకూడదు, కైకకు ఇచ్చిన మాట తప్పితే ఆయనకు అసత్యదోషం కలుగుతుంది, ఈ దోషం నుంచి తండ్రిని కాపాడటానికే రాఘవుడు అడవులకు వెళ్ళాడు’ అని శ్రీరామశర్మ వివరించారు. వేదిక వ్యవస్థాపక కార్యదర్శి చింతలపాటి శర్మ తన తండ్రి వేంకట హనుమంతరావు, వరలక్ష్మి దంపతుల స్మారక పురస్కారాన్ని చిర్రావూరి దంపతులకు అందచేశారు. నిత్యవిద్యార్థి డాక్టర్ కర్రి రామారెడ్డి అధ్యక్షత వహించారు. సభాప్రారంభకుడు, ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్.పి.గంగిరెడ్డి మాట్లాడుతూ కాళిదాసు సాహిత్యంలోని శ్రౌతధర్మాలను నేటి తరానికి తెలియచెప్పడం ద్వారా యువతను దురలవాట్లనుంచి దూరం చేయగలమన్నారు. గేయకవి జోరాశర్మ స్వాగత వచనాలు పలికారు. సరసకవి ఎస్వీ రాఘవేంద్రరావు వందన సమర్పణ చేశారు. ఓఎన్జీసీ విశ్రాంత జనరల్ మేనేజర్ గుంటూరు వెంకటేశ్వరరావు, విశ్రాంత ఆచార్యుడు డాక్టర్ బి.వి.ఎస్.మూర్తి, డాక్టర్ మేజర్ చల్లా సత్యవాణి, విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ అద్దేపల్లి సుగుణ, ఆదిత్య మహిళాకళాశాల ప్రిన్సిపాల్ ఫణికుమార్, సాహితీవేత్తలు హాజరయ్యారు.