చమురు పీఎస్‌యూల్లో వాటాలు.. ప్రత్యేక సంస్థకు
న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్‌మెంట్ చేయబోయే ప్రభుత్వ రంగ చమురు సంస్థల్లో(పీఎస్‌యూ) కొంత మేర వాటాలను ప్రత్యేక కంపెనీకి బదలాయించాలని కేంద్రం యోచిస్తోంది. తద్వారా చమురు ధరల్లో హెచ్చుతగ్గులతో మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైనా.. తమ వాటాల విలువను కాపాడుకోవచ్చని ఆర్థిక శాఖ భావిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్(ఐవోసీ), ఆయిల్ ఇండియా (ఆయిల్), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్) తదితర పీఎస్‌యూల్లో మైనారిటీ వాటాల విక్రయంతో కనీసం రూ. 27,000 కోట్లు సమీకరించాలని కేంద్రం యోచిస్తోంది. షేర్ల ప్రస్తుత ధరల ప్రకారం ఓఎన్జీసీలో 5% వాటాల విక్రయంతో రూ.12,000 కోట్లు, ఐవోసీలో 10% డిజిన్వెస్ట్‌మెంట్‌తో రూ. 10,000 కోట్లు, ఆయిల్లోనూ 10% వాటాల విక్రయంతో రూ.2,600 కోట్లు రావొచ్చని అంచనా. అలాగే, బీపీసీఎల్‌లో 3% డిజిన్వెస్ట్‌మెంట్‌తో రూ. 2,000 కోట్లు వస్తాయని కేంద్రం భావిస్తోంది.