చుండూరుపై ‘సుప్రీం’లో ఎస్ఎల్పీ
గుంటూరు జిల్లా పోలీసుల సమాయత్తం
గుంటూరు, న్యూస్‌లైన్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చుండూరు దళితుల ఊచకోత కేసు లో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్‌లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ) దాఖలు చేసేందుకు గుంటూరు జిల్లా పోలీసు యంత్రాంగం సమాయత్తమైంది. నిందితుల శిక్ష రద్దు చేస్తూ హైకోర్టు ఈ నెల 23న తీర్పు వెలువరించడం తెలి సిందే. 1991 ఆగస్టు 6న చుండూరు, మోదుకూరు, అమృతలూరు గ్రామాల్లోని దళితులకు, అగ్రవర్ణాలకు మధ్య జరిగిన ఘర్షణలో దళితుల ఊచకోతకు తెగబడిన విషయం విదితమే. ఈ కేసులో 21 మందికి యావజ్జీవ శిక్ష, 35 మందికి ఏడాది జైలుశిక్ష, జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు 2007లో తీర్పు ఇచ్చింది. దీనిపై నిందితులు హైకోర్టుకు అప్పీలు చేసుకోగా.. వారికి విధించిన శిక్షలను రద్దుచేయడంతో, జరిమానాలను తిరిగి చెల్లించాలని హైకోర్టు తాజాగా తీర్పుచెప్పడం తెలిసిందే. దీంతో హైకోర్టు తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ జిల్లా పోలీసులు సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయించారు. ఈ మేర కు సుప్రీంకోర్టులో అప్పీలు చేసేందుకు ఏఎస్పీ డి.కోటేశ్వరరావు శుక్రవారం ఢిల్లీ వెళ్లారు.