మీ ఇంటికొస్తారు.. సమస్యలు చెప్పండి
జీహెచ్ఎంసీ స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ సూచన
సిటీబ్యూరో:‘అధికారులు, సిబ్బంది మీ ఇంటికి వస్తారు. మీ పరిసరాల్లో పారిశుద్ధ్యం, రహదారులు, వీధి దీపాల సమస్యలు ఉంటే... వారితో చెప్పండి. వాటిని వెంటనే పరిష్కరిస్తారు. అంతే కాదు... పన్నుల చెల్లింపులో ఏవైనా ఇబ్బందులున్నా పరిష్కరిస్తారు. వారి సహకారం తీసుకోండి ’ అంటూ జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకుగాను సర్కిళ్లలో 24 మంది పర్యవేక్షక అధికారులు, 33 మంది నోడల్ అధికారులతో పాటు 1500 మంది ఔట్రీచ్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించామన్నారు. శుక్రవారం స్పెషల్ కమిషనర్లు ఎ.బాబు, ప్రద్యుమ్నలతో కలిసి ఆదాయం పెంపుపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషలాఫీసర్ మాట్లాడుతూ సదుపాయాలు మెరుగుపరచాలన్నా, అభివృద్ధి పనులు జరగాలన్నా నిధులు అవసరమని గుర్తు చేశారు.
ఈ విషయాన్ని ఇంటింటికీ వెళ్లి వివరించడంతో పాటు, ప్రజల సమస్యలను స్థానికంగా పరిష్కరించాలని ఆదేశించారు. దీనికి కాలనీ సంఘాలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల సహకారం తీసుకోవాలన్నారు. జీహెచ్ఎంసీ సేవలు, నిధుల ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిందిగా అధికారులకు సూచించారు. ఎలాంటి అదనపు భారాన్నీ మోపలేదని, ప్రస్తుతం అమలులో ఉన్న పన్నులనే వసూలు చేస్తున్నామనే అంశాన్ని గుర్తించాల్సిందిగా ప్రజలకు సూచించారు. మహా నగర ప్రజలకు మెరుగైన సదుపాయాల కోసం ప్రణాళికలు సిద్ధం చేశామని, వాటి అమలుకు నిధులు అవసరమని చెప్పారు. ప్రజలు జీహెచ్ఎంసీ వెబ్సైట్ నుంచే వివిధ సేవలు పొందే సదుపాయాల్ని అందుబాటులోకి తెచ్చామన్నారు.