టీటీడీకి స్పెసిఫైడ్ అథారిటీ
ఫైల్ సిద్ధం చేసిన ఎండోమెంట్ విభాగం
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి ఆశిస్తున్నవారికి రాష్ట్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేసేలా రంగం సిద్ధం చేసింది. శాసనసభ సమావేశాల పేరుతో ట్రస్టు బోర్డు ఏర్పాటును మరింత జాప్యం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్టు టీటీడీలో ప్రచారం జోరందుకుంది.
అసెంబ్లీ సమావేశాల పేరుతో..: టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేసేందుకు ససేమిరా అన్న కనుమూరి బాపిరాజు నేతృత్వంలోని కమిటీని ఈనెల 9వ తేదిన ప్రభుత్వం ఆర్డినెన్స్ తో రద్దు చేసింది. కేంద్ర కేబినెట్ హోదాతో సమానంగా పరిగణించే టీటీడీ చైర్మన్ పదవికి తొలి నుంచి ఆశావహుల సంఖ్య అధికంగానే ఉంది. ప్రస్తుత బోర్డును రద్దు చేశాక కీలక పదవిని ఆశించేవారి జాబితా చాంతాడంత పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే రాష్ర్ట శాసన సభ బడ్జెట్ సమావేశాలు ఈనెల 18వ తేది నుంచి సెప్టెంబర్ 12వ తేది వరకు జరగనున్నాయి. ఇంతలోపే హడావిడిగా కొత్త ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేస్తే పదవుల పందేరంలో సమస్యలు వస్తాయని టీడీపీ అధినేత చంద్రబాబు యోచన చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల పేరుతో ట్రస్టు బోర్డు ఏర్పాటు మరింత జాప్యం చేయాలని భావిస్తున్నారు.
ఇంతలోపు టీటీడీలో పరిపాలన పరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఐఏఎస్ అధికారులతో కూడిన స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. దీనిపై ఇప్పటికే సంబంధిత శాఖాధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. దీనిపై రాష్ట్ర ఎండోమెంట్ మంత్రి వద్ద ఫైల్ సిద్ధమైనట్టు విశ్వసనీయ సమాచారం. కొత్త స్పెసిఫైడ్ అథారిటీకి సంబంధించి మరో రెండు మూడురోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. స్పెసిఫైడ్ అథారిటీపై టీటీడీ ఉన్నతాధికారుల్లో చర్చ జోరందుకుంది.