ఆట అన్నీ నేర్పిస్తుంది వీవీఎస్ లక్ష్మణ్
ఆటలాడే ప్రతి పిల్లాడూ ప్రొఫెషనల్ కావాలనేం లేదు. వాస్తవానికి అత్యున్నత స్థాయికి ఎదిగేవాళ్ల సంఖ్య చాలా తక్కువ. కానీ ఒక పిల్లాడు జీవితంలో ఎదిగే క్రమంలో క్రీడలు అన్నీ నేర్పిస్తాయి. ధైర్యంగా వ్యవహరించడం, కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్‌గా కలిసి పని చేయడం, ఇంకా చెప్పాలంటే గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించడం తెలుస్తుంది. ఈ అలవాట్లు ఒక పరిపూర్ణ వ్యక్తిగా ఎదిగేందుకు ఎంతో ఉపయోగపడతాయనేది నా నమ్మకం. వీటన్నింటికీ స్పోర్ట్స్‌ను ప్లాట్‌ఫామ్‌గా చెప్పవచ్చు. చిన్నారులు తాను ఏదైనా ఆట ఆడతానని చెప్పినప్పుడు తల్లిదండ్రులు అతని కోరికను మొగ్గలోనే తుంచేయవద్దు. ముఖ్యంగా రెండు అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి.
అబ్బాయితో, అతని స్కూల్లో, కోచ్‌తో మాట్లాడి అసలు ఒక ఆటగాడిగా మారేందుకు ఇతనిలో ఏ మాత్రం లక్షణాలు ఉన్నాయో గుర్తించి నిర్ణయం తీసుకోవాలి. అన్నింటికీ మించి అతనికి ఒక అవకాశం ఇచ్చి చూడాలి. అతను ఆశించిన క్రీడను ఒక స్థాయి వరకు ఆడనిచ్చి ఒక వేళ వైఫల్యం ఎదురైతే... అప్పుడు తాను అనుకున్న విధంగా మరో రంగంలో మళ్లించే విధంగా ప్రత్యామ్నాయం చూసుకోవాలి. ఒకప్పటిలా పుస్తకాల పురుగులే జీవితంలో విజయం సాధిస్తారనే రోజులు పోయాయి.
అండగా నిలిస్తే ఆటల్లోనూ అద్భుతాలు సాధించవచ్చు. ఒక క్రీడాకారుడిగా దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం ఎంతో గర్వకారణం. ఆ స్థాయికి చేరాలంటే ఎంతో ప్రోత్సాహం అవసరం. చాలా మంది క్రికెట్లో ఉన్న డబ్బు, పేరును చూసి ఇదే ఆడతామని చెబుతారు. కానీ నాకు తెలిసి ఇప్పుడు బ్యాడ్మింటన్, టెన్నిస్, షూటింగ్, ఆర్చరీ... ఇలా అన్ని ఆటల్లో అవకాశాలు ఉన్నాయి. మంచి విజయాలు సాధిస్తే వాటిలోనూ పేరుప్రఖ్యాతులు దక్కుతాయి. ఈ ఆటగాళ్లకు కూడా మంచి ఫాలోయింగ్ లభించడం నేను చూస్తున్నాను. కాబట్టి ఆట ఏదైనా పిల్లలను ప్రోత్సహించడం ముఖ్యం.