శివ పంచాక్షరితో మారుమోగిన కృష్ణాతీరం
విజయవాడ(భవానీపురం): హరోం హర..ఓం నమశ్శివాయి అంటూ శివభక్తుల శివ పంచాక్షరితో కృష్ణాతీరం మారుమోగింది. శివ పంచాక్షరితో తానుకూడా తన్మయం చెందినట్లు కృష్ణమ్మ అలలతో సవ్వడి చేసింది. ఒక వైపు శంఖనాదం, మరోవైపు డమరుక నాదంతో భక్తులు పులకించిపోయారు. వేదికపై శరీరమంతా చితాభస్మం కలిగిన గుంటూరుకు చెందిన శివ భక్తులు బాబా, ఆయన శిష్య బృందం చేస్తున్న శివ ఘోషకు భక్తులు తమ గొంతులను కలిపారు. కార్తీకమాస సందర్భంగా భవానీపురానికి చెందిన శ్రీకన్యకా పరమేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక పున్నమి ఘాట్లో నిర్వహించిన మహారుద్రాభిషేకం వైభవంగా జరిగింది. శివునికి ప్రీతకరమైన విశేష ద్రవ్యాలతో, పుణ్యనదీ జలాలతో రుద్రుని అభిషేకించారు. విశేషంగా భోళాశంకరుడికి చేసిన భస్మాభిషేకం భక్తులను పరవసింపచేసింది. అభిషేకాలను భక్తులు దగ్గరగా తిలకించేందుకు నిర్వాహాకులు పలుచోట్ల ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నగర మేయర్ కోనేరు శ్రీధర్, టీడీపీ ఫ్లోర్ లీడర్ గుండారు హరిబాబు, కార్పొరేటర్ యేదుపాటి రామయ్య విచ్చేసి వేదికపై ఏర్పాటు చేసిన శివలింగానికి పూజలు నిర్వహించారు. నిర్వాహకులు 70 కిలోల స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని వేలం వేయగా కలిదిండి శార రూ.3,20116లకు పాడుకుంది. ఈ మొత్తాన్ని గుంటూరులో నిర్మించనున్న కోటిలింగాల క్షేత్రం నిర్మాణానికి అవసరమైన నిర్మాణ సామగ్రిని అందించాల్సిందిగా నిర్వాహకులు కోరారు.