13 లేక 14న శ్రీరామ ప్రాజెక్టు
♦ శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్
♦ రూ.7,901 కోట్లకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం
♦ కాంట్రాక్టర్లతో సర్కారు చర్చలు
సాక్షి, హైదరాబాద్: శ్రీరామ ప్రాజెక్టుగా నామకరణం చేసిన సమీకృత ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టు పనులకు ఈ నెల 13 లేక 14న ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖమ్మం జిల్లాలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. దీనిపై ఇప్పటికే జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహా ఇతర నేతలకు ముఖ్యమంత్రి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టుల కింద ఇప్పటివరకూ చేసిన పనులను అనుసంధానం చేస్తూ ఖమ్మం జిల్లా సాగునీటి వ్యవస్థను మెరుగుపరిచేలా దుమ్ముగూడెం తుది ప్రణాళిక ఖరారైన విషయం తెలిసిందే.
గోదావరి నుంచి 50 టీఎంసీల నీటిని తరలించి జిల్లాలో 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి నిర్ణయించారు. ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్ జిల్లా మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలకు కూడా నీరందుతుంది. పాల్వంచ మండలం కోయగుట్ట, ముల్కంపల్లి మండలం కమలాపురం, తోగ్గూడెం, టేకులపల్లి మండలం రోళ్లపాడు గ్రామాల్లో నాలుగు పంపుహౌజ్‌లు, ఆరు లిఫ్టులు ఏర్పాటు చేసేలా ప్రణాళిక సిద్ధం చేయగా, మొత్తం నిర్మాణానికి రూ.7,901 కోట్లకు ఇటీవల మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
సామరస్యంగా తప్పుకోండి
శ్రీరామ ప్రాజెక్టుకు కొత్తగా టెండర్లు పిలవాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. పాత ఎస్ఎస్ఆర్ రేట్లతో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చే పరిస్థితి లేనందున మళ్లీ టెండర్లకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ప రిధిలో ఇప్పటికే పనులు చేస్తున్న పాత కాంట్రాక్టర్లతో మంగళవారం నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీలు మురళీధర్, విజయ్‌ప్రకాశ్‌లు చర్చలు జరిపారు. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా సామరస్యంగా పనుల నుంచి తప్పుకోవాలని అధికారులు కోరారు. తమకు రావాల్సిన మొత్తాలను చెల్లిస్తే ప్రభుత్వం చెప్పిన మేరకు నడుచుకునేందుకు సిద్ధమని కాంట్రాక్టర్లు తెలిపారు.
దుమ్ముగూడెం టెయిల్‌పాండ్‌కు సంబంధించి సైతం చెల్లింపులు చేయాలని కాంట్రాక్టర్లు కోరారు. తాము కోరుతున్నట్లుగా చెల్లిస్తే కోర్టు నుంచి కేసును ఉపసంహరించుకుంటామన్నారు. ప్రభుత్వమే టెయిల్‌పాండ్‌ను రద్దు చేయాలని నిర్ణయించినందున, ఈ వ్యవహారాన్ని ముగించే బాధ్యత సైతం ప్రభుత్వంపైనే ఉందని వారు చెప్పినట్లు తెలిసింది. దీనిపై మంత్రితో మాట్లాడిన అనంతరం తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం.