తిరుమలపై విమానాలు వెళ్లొచ్చు..
కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి
సాక్షి,తిరుమల: ‘తిరుమలపై విమానాలు వెళ్లొచ్చు.. హెలిప్యాడ్ కట్టొచ్చు’ అని కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి అన్నారు. ఆదివారం ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మూలమూర్తి కొలువైన గర్భాలయంపై మాత్రమే విమానాలు వెళ్లకూడదని, దాన్ని శాస్త్రం కూడా అంగీకరించదని చెప్పారు. తిరుమల క్షేత్ర సమీపంలోని గగనతలంపై వెళితే మాత్రం ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. భక్తుల సౌకర్యం కోసం స్థలం ఉంటే తిరుమలలోనే హెలిప్యాడ్ కూడా కట్టొచ్చన్నారు.
ఆగమాలకు ఎలాంటి విఘాతం కలగదని, అపచారమూ కాదని చెప్పారు. తిరుమల కొండపైకి బస్సులు తిరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తిరుమలకు రోప్వేతోపాటు రైళ్ల మార్గాలు ఎందుకు ఏర్పాటు చేయకూడదు? అని ఆయన ప్రశ్నించారు. భక్తుల సౌకర్యం కోసం చేపట్టే కార్యక్రమాలపై వివాదాలు చేయటం సరికాదన్నారు. గర్భాలయ మూలమూర్తికి విరామ సమయం తగ్గించటం మంచిది కాదని, శాస్త్ర విరుద్ధమైన కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టకూడదని తెలిపారు.