అట్రాసిటీ కేసులపై సత్వర దర్యాప్తు
గుంటూరు క్రైం:
జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తును వీలైనంత త్వరగా పూర్తిచేసి నిందితులను కోర్టులో హాజరు పరచాలని అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్ డీఎస్పీలను ఆదేశించారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో జిల్లా పరిధిలోని డీఎస్పీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ దర్యాప్తులో ఫిర్యాదు అవాస్తవమని తేలితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను తనకు అందజేయాలని చెప్పారు. నేరాల నియంత్రణకు అవసరమైన అన్నిరకాల ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాజధాని ఏర్పాటు క్రమంలో జిల్లాలోని భూములు, స్థలాల ధరలు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో స్థలాల ఆక్రమణలకు, దాడులకు పాల్పడుతున్న వ్యక్తులపై నిర్ధాక్షిణ్యంగా కేసులు నమోదు చేయాలన్నారు.
ఫిర్యాదులు వచ్చినపుడు కేసులు నమోదు చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చట్ట పరిధిలో బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘాను కొనసాగించాలన్నారు. ఎప్పటికప్పుడు వారికి సంబంధించిన సమాచారాన్ని సేకరించేలా కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయాలని చెప్పారు.
రౌడీషీటర్ల వివరాలను తెలియచేయడంలో విఫలమైతే సంబంధిత అధికారులు, సిబ్బందే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో హత్యలు, హత్యాయత్నాలు, అల్లర్లు, దొమ్మీలకు పాల్పడినవారిపై సస్పెక్టెడ్ రౌడీషీట్లు తెరవాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించబోనని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీలు జె.భాస్కరరావు, బి.శ్రీనివాసరావు, డీఎస్పీలు డి.గంగాధరం, ఎం.మధుసూదనరావు, కె.నరసింహ, బి.పి.తిరుపాల్, ఎస్.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
మహిళలకు అండగా ఉంటాం..
ఆపదలో ఉన్న మహిళలకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్ చెప్పారు. గృహహింస చట్టం కింద ఫిర్యాదు చేసిన మహిళలు.. స్త్రీశిశు సంక్షేమశాఖ ద్వారా పునరావాసం, లబ్ధి పొందిన మహిళలతో ఎస్పీ శుక్రవారం సమావేశమయ్యారు. పోలీసుల కౌన్సెలింగ్ అనంతరం భర్తతో కలసి కాపురం చేసుకుంటున్నామని కొందరు, భర్తల వేధింపులు భరించలేక పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నామని మరికొందరు ఎస్పీకి వివరించారు.
భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తినా పోలీసులను సంప్రదించాలని ఎస్పీ సూచించారు. కౌన్సెలింగ్ సెంటర్లో రిటైర్డ్ ఉద్యోగులు సేవాభావంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. వారికి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీలు జె.శ్రీనివాసరావు, బి.శ్రీనివాసులు, స్త్రీశిశు సంక్షేమ శాఖాధికారులు ఎన్.సంగీత, వి.పద్మ, రిటైర్డ్ ఏఎస్పీలు రహమాన్, రవీంద్రనాధ్ ఠాగూర్, పీపీ టి. వెంకటేశ్వరరావు, మానసిక వైద్యులు వై.సంజయ్, ఏ.సీతామహాలక్ష్మీ, సుజాత, బి.హనుమంతరావు, సీఐ పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.