బ్యాక్‌లాక్ పోస్టులు
ఒంగోలు టౌన్ : నాలుగు నెలలైనా నియామకాల్లేక ఎస్సీ,ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఊరిస్తున్నాయి. జిల్లా యంత్రాంగం ఆర్భాటంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎస్సీ,ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. వేలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.. మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తామని ప్రకటించడంతో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చి పడ్డాయి.
దరఖాస్తుల స్వీకరణ ముగిసి నాలుగు నెలలైనా ఇంతవరకు ఎలాంటి నియామకాలూ చేపట్టలేదు. అభ్యర్థులు మాత్రం ఏరోజుకారోజు బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించిన వివరాలు వస్తాయని ఆశగా ఎదురుచూస్తూ నిరాశ చెందుతున్నారు. మరికొంతమంది అభ్యర్థులు ప్రకాశం భవనం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. బ్యాక్లాగ్ పోస్టుల ఫలితాలను ఎప్పుడు ప్రకటిస్తారంటూ కలెక్టరేట్లోని కనిపించిన ప్రతి అధికారి, సిబ్బందిని అడుగుతూనే ఉన్నారు. జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో 38 ఎస్సీ,ఎస్టీ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు యంత్రాంగం గుర్తించింది. ఈ ఏడాది జూన్ 23 నుంచి 30వ తేదీ వరకు కలెక్టరేట్లో దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. మొత్తం 7738 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 238 మంది అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాలు అందించకపోవడంతో వారి దరఖాస్తులను పక్కన పెట్టేశారు.
భర్తీపై ‘పచ్చ’నీడలు
ఎస్సీ,ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీపై ‘పచ్చ’ నీడలు కమ్ముకున్నాయి. తెలుగుదేశం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలు ప్రతిదానిలో తమ మార్కు కనిపించుకునేందుకు పోటీ పడుతున్నారు. విద్యార్హతతో సంబంధం లేని పోస్టులను తమ ఖాతాల్లో వేసుకునేందుకు కొంతమంది తెలుగుదేశం నాయకులు తమకు అనుకూలంగా ఉన్న శాసనసభ్యుల ద్వారా అధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొంతమంది ఒకడుగు ముందుకేసి బ్యాక్లాగ్ పోస్టులకు రేట్లు నిర్ణయిస్తున్నట్లు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది.
అధికార పార్టీ నాయకులు సూచించిన వారిని కాదని బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ కావని, అడిగినంత సొమ్ము ఇస్తే పోస్టు గ్యారంటీ అంటూ అభ్యర్థులకు వల విసురుతున్నారు. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో ఆలస్యం జరిగేకొద్దీ మాయాజాలంలో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా బ్యాక్లాగ్ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు.