తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే ఆరోపణలు
జగిత్యాల రూరల్ : తన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై ఆరోపణలతో ఎదురుదాడి చేస్తోందని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన జగిత్యాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సామర్థ్యానికి మించి నీటిని విడుదల చేయడంతోనే మల్యాల మండలం మానాల వద్ద ఎస్సారెస్పీ కాకతీయ కాల్వకు గండిపడిందన్నారు. పనుల్లో నాణ్యత లేకపోవడం వల్లనే ఎగువమానేరు రిజర్వాయర్ కట్టకు గండి పడ్డదన్నారు. ఈ రెండు సంఘటనలపై విచారణ నిర్వహించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తుంటే స్పందించని ప్రభుత్వం.. ఎదురుదాడికి దిగడం విడ్డూరంగా ఉందన్నారు. ఎలాంటి విచారణ లేకుండా ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయడం ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికే అన్నారు. మిడ్‌మానేరు భూనిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామన్నా సీఎం హామీని నెరవేర్చాలన్నారు. ఇప్పటికైనా నిర్మాణాత్మకంగా అడుగులు వేస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సిరాజోద్దీన్ మన్సూర్, మండల ఉపాధ్యక్షుడు గంగం మహేశ్, డీసీసీ ఉపాధ్యక్షుడు బండ శంకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొలుగూరి దామోదర్‌రావు పాల్గొన్నారు.