state government plans
-
వ్యయాన్ని తగ్గించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ప్రతిపాదించిన ఆరు విమానాశ్రయాలపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రూపొందించిన ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని తగ్గించాలని రాష్ట్రప్రభుత్వం కోరింది. ఆ విమానాశ్రయాల ఏర్పాటుకు అడ్డుగా ఉన్న కొన్ని నిర్మాణాలను తొలగించాల్సిందేనంటూ ఇటీవల టెక్నో ఎకనమిక్ ఫీజుబిలిటీ స్టడీ నివేదికలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించింది. ఇందులో అంచనా వ్యయాన్ని కూడా పేర్కొంది. అయితే నిర్మాణాల తొలగింపు ఖర్చు రాష్ట్రప్రభుత్వానికి భారంగా మారింది. ఒక్కో విమానాశ్రయానికి సగటున రూ.600 కోట్ల చొప్పున ఖర్చు చేయా ల్సి వస్తోంది. ఈ ఖర్చును తగ్గించేందుకు కొన్ని మార్పులు చేయాలని రాష్ట్రప్రభుత్వం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులను కోరింది. మంగళవారం వర్చువల్ పద్ధతిలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ ఆధ్వర్యంలో అధికారులు మెట్రోభవన్ నుంచి ఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈడీతో భేటీ అయ్యారు. ఖర్చును తగ్గింపునకు కొన్ని సూచనలు చేశారు. ►వరంగల్ సహా మరో రెండు విమానాశ్రయా లకు కాస్త దూరంగా గుట్టలున్నాయి. సాంకేతిక ఇబ్బందులు రాకుండా వీటిని కొంతమేర తొలగించాలని గతంలో ఏఏఐ పేర్కొంది. ఈ పనిని మినహాయించాలి. అందుకు ప్రత్యామ్నాయం చూపాలి. ►రెండు విమానాశ్రయాలకు థర్మల్ విద్యుత్తు కేంద్రం కూలింగ్ టవర్లు(చిమ్నీలు) అడ్డుగా ఉన్నందున తొలగించాలని సూచించారు. ఇది భారీ ఖర్చుతో కూడుకున్నది. దీన్ని కూడా మినహాయించాలి. అవి దాటిన తర్వాతనే భూసేకరణకు అనుమతినివ్వాలి. ►బసంత్‌నగర్ విమానాశ్రయానికి చేరువగా ఉన్న సిమెంటు ఫ్యాక్టరీ చిమ్నీని తొలగించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. దీనికి ప్రత్యామ్నాయం చూపాలి. ►రెండుచోట్ల కొన్ని పరిశ్రమలను తొలగించాలన్న అంశాన్ని కూడా పునఃపరిశీలించాలి. అం తమందికి ఉపాధి కల్పించటం ప్రభుత్వానికి పెద్ద భారంగా ఉంటుంది. ►రెండు విమానాశ్రయాలకు చేరువగా ఉన్న ప్రార్థన మందిరాలను తొలగించాలన్న సూచనను కూడా ఉపసంహరించుకోవాలి. ఆయా ప్రాంతాల్లో తక్కువ భూమిని విమానాశ్రయాలకు కేటాయించేలా చూడాలి. కాగా, ఈ అంశాలపై పరిశీలించి తగు సూచనలు అందించేందుకు మరో సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇందులో ఏయే విమానాశ్రయాలను ముందు చేపట్టనున్నారో కూడా స్పష్టత రానుంది. -
‘మల్లన్న’ చెంతకు గోదారి
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతలు పథకంలో భాగంగా మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి భారీ సామర్థ్యంతో చేపడుతున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు ఎత్తిపోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ నెల 18 లేదా 20న వేదపండితుల పూజలు, ఆశీర్వచనాల మధ్య తుక్కాపూర్ పంప్‌హౌస్‌లోని మోటార్లను ఆన్ చేయడం ద్వారా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎత్తిపోతలు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ఇరిగేషన్ శాఖకు ప్రభుత్వం ప్రాథమిక సమాచారం అందించింది. ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించింది. రంగనాయక్‌సాగర్ టు మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను ఈ ఏడాది జూన్ నాటికే సిద్ధంచేయాలని భావించినా కరోనా లాక్డౌన్, తొలకరి వర్షాల కారణంగా పనులు కాస్త ఆలస్యమయ్యాయి. అయితే ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ చేసేలా పనులు పూర్తయిన నేపథ్యంలో, ఈ ఏడాది మొదట 10 టీఎంసీలు నిల్వ చేయనున్నారు. ఆ తర్వాత ఐదేసి టీఎంసీల చొప్పున నిల్వ పెంచనున్నారు. రంగనాయక్‌సాగర్‌లోని నీటిని తుక్కాపూర్ వద్ద నిర్మించిన పంప్‌హౌస్‌లోని 8 మోటార్ల ద్వారా మల్లన్నసాగర్‌కు తరలించేలా ఇప్పటికే పనులన్నీ మొదలయ్యాయి. ప్రస్తుతం రంగనాయక్‌సాగర్‌లో 3.5 టీఎంసీలకు గానూ 3 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది. ఇక్కడి నిల్వలు ఖాళీ అయితే మిడ్‌మానేరు నుంచి నీటిని తరలిస్తూ మల్లన్నసాగర్ నింపనున్నారు. మిడ్‌మానేరులో ప్రస్తుతం 27.50 టీఎంసీలకు గానూ 25 టీఎంసీల మేర నిల్వలున్నాయి. అత్యంత ఎత్తున.. భారీ సామర్థ్యంతో.. ►కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఒడిసి పట్టుకొని రెండు సీజన్లలోనూ ఆయకట్టుకు నీటి లభ్యత పెంచే లక్ష్యంతో మొత్తం 141 టీఎంసీల సామర్థ్యంతో 18 రిజర్వాయర్ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో అత్యంత భారీగా ఏకంగా 50 టీఎంసీల సామర్థ్యంతో, సముద్ర మట్టానికి 555 మీటర్ల ఎత్తున.. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను రూ.6,805 కోట్లతో చేపట్టారు. ►ఈ రిజర్వాయర్ నిర్మాణానికి ఏకంగా 22.60 కిలోమీటర్ల పొడవైన కట్ట నిర్మాణం చేయాల్సి ఉండగా, కట్ట గరిష్ట ఎత్తు 58.5 మీటర్లుగా ఉంది. ►కట్ట నిర్మాణానికి 13.58 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర మట్టి పని, 2.77 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయాల్సి ఉండగా ఇందులో ఇప్పటికే 96 శాతం పనులు పూర్తి చేశారు. ►ఈ రిజర్వాయర్ నుంచే కొండపోచమ్మ సాగర్, గంధమల, బస్వాపూర్‌లతో పా టు, సింగూరు, నిజాంసాగర్, ఎస్సారెస్పీ స్టేజ్–1 ఆయకట్టుకు నీళ్లు చేరనున్నాయి. ►మొత్తంగా ఈ రిజర్వాయర్‌పై ఆధారపడిన కొత్త ఆయకట్టు 8.33 లక్షల ఎకరాలు ఉండగా, స్థిరీకరణ ఆయకట్టు మరో 7.37 లక్షల ఎకరాలు ఉంది. ►ఈ ప్రాజెక్టుకు అవసరమైన 17,871 ఎకరాల భూమిని ఇప్పటికే సేకరించారు. ►ఈ రిజర్వాయర్ నిర్మాణంతో రాంపూర్, బ్రాహ్మణబంజేరుపల్లి, లక్ష్యాపూర్, ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్, పల్లెపహాడ్, సింగారం, ఎర్రవెల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతుండగా, 4,298 కుటుంబాలు ప్రభావితం అయ్యాయి. ►మట్టి పనుల్లో ఎక్కడా నాణ్యత లోపాలు తలెత్తకుండా ప్రతి రీచ్‌కు ఐదుగురు ఇంజనీర్లతో పర్యవేక్షణ ఉండేలా గజ్వేల్ కేంద్రంగా ప్రత్యేక క్వాలిటీ కంట్రోల్ డివిజన్ ఏర్పాటు చేశారు. -
‘తుంగభద్ర’పై రెండు లిప్టు స్కీంలు !
సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర నదిపై రెండు లిప్టు స్కీంలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సుమారు రూ. 31 కోట్లను విడుదల చేశారు. ఈ మేరకు సోమవారం సాగునీటి శాఖ ముఖ్యకార్యదర్శి బి. అరవిందరెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. కర్నూలు జిల్లా బెలగాల్ మండలం పరిధిలో తుంగభద్ర నదిపై కొత్తగా లిప్టు స్కీంను నిర్మించనున్నారు. ఇందుకోసం రూ. 23.42 కోట్లను విడుదల చేశారు. ఈ స్కీం ద్వారా సుమారు 2,270 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించనున్నారు. అలాగే ఇదే జిల్లాలో కౌతాలం పరిధిలో రూ. 8.58 కోట్లతో మరో లిప్టు స్కీంను నిర్మిస్తారు. దీన్ని ద్వారా 1,200 ఎకరాలకు సాగునీరు అందనుంది.