అతిసార
బాధితులు 2.48 లక్షల మంది చిన్నారులు
అప్రమత్తమైన రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
ఆగస్టు 9 వరకు జాగృతి కార్యక్రమం
ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ సిరప్‌ల వితరణ
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో అతిసార విజృభిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడిన చిన్నారులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ 2,48,142 మంది చిన్నారుల్లో ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నివారణ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా జాగృతి కార్యక్రమాలను సోమవారం ప్రారంభించింది. ఇవి వచ్చే నెల తొమ్మిది వరకూ కొనసాగుతాయి.
ఇందులో భాగంగా ఆశాకార్యకర్తలు ఇంటింటికి తిరిగి అతిసారాకు గురైన చిన్నారులను గుర్తించి వైద్య సేవలు అందిస్తారు. అంతే కాకుండా ఓఆర్ఎస్ పాకెట్లను, జింక్ సిరప్‌ను ఉచితంగా అందజేస్తారు. ఇందుకోసం ఇప్పటికే 40,35,370 ఓఆర్ఎస్ (ఓరల్ రీ హైడ్రేషన్ సాల్ట్) పాకెట్లను, 4,55,070 జింక్ సిరప్ బాటిళ్లను సిద్ధం చేసిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వాటిని రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరఫరా చేసింది.
అంతేకాక అవసరమైతే మరిన్ని ఓఆర్ఎస్, జింక్ సిరప్‌ల బాటిళ్లను వితరణ చేయడానికి బఫర్‌స్టాక్‌ను కూడా అందుబాటులో ఉంచుకుంది. రాష్ట్ర విద్యాశాఖ, మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారుల సహాయంతో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో అతిసార విషయమై వీధి నాటకాలు, చిత్రాల ప్రదర్శన తదితర వాటి ద్వారా జాగృతి కార్యక్రమాలు నిర్వహించనుంది. కాగా, అపరిశుభ్రమైన ఆహారం తినడం వల్లే పిల్లలు అతిసార బారిన పడుతున్నారని వైద్యలు పేర్కొంటున్నారు.
అందువల్ల వీధుల్లో విక్రయించే తినుబండారాలకు పిల్లలను దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా అతిసారపై ప్రజల్లో జాగృతి కల్పించడానికి ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న వైద్యులు కూడా ముందుకు రావాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఓ ప్రకటనలో కోరింది. ఒకే ప్రాంతం నుంచి ఎక్కువ అతిసారా కేసులు ఆస్పత్రికి వస్తే.. వెంటనే స్థానిక ప్రభుత్వ వైద్యాధికారికి తప్పక తెలియజేయాలని పేర్కొంది.