పెట్టుబడులకు నెదర్లాండ్స్ కంపెనీల ఆసక్తి
నెదర్లాండ్స్ రాయబారితో రాష్ట్ర అధికారులు భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు నెదర్లాండ్స్‌కు చెందిన పలు కంపెనీలు ఆసక్తి చూపడంతో పాటు పలు ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం వహించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశాయి. పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, ఆర్అండ్బీ కార్యదర్శి సునీల్ శర్మ, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి నేతృత్వంలోని రాష్ట్ర అధికారుల బృందం.. భారత్‌లో నెదర్లాండ్స్ రాయబారి అల్ఫోన్సస్ స్టొలింగాతో సోమవారం ఢిల్లీలో సమావేశమైంది.
ఈ భేటీలో కాబా ఇన్ ఫ్రాస్ట్రక్చర్, రాయల్ హస్కొనింగ్, వుమెన్ ఆన్ వింగ్స్, ఎకోరిస్ తదితర కంపెనీలకు చెందిన ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానంతో పాటు ముచ్చర్ల ఫార్మాసిటీ, టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర అధికారుల బృందం ఆయా కంపెనీలకు వివరించింది.
నీటి యాజమాన్యం, పట్టు పరిశ్రమ, నైపుణ్యాభివృద్ధి, విత్తనాభివృద్ధి, వ్యర్థాల నిర్వహణ, రోడ్లు, జలమార్గాలు తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు నెదర్లాండ్స్ కంపెనీల ప్రతినిధులు ఆసక్తి చూపారు. త్వరలో రాష్ట్రంలో పర్యటించి ఆయా విభాగాల అధికారులతో సమావేశం కావాల్సిందిగా రాష్ట్ర అధికారుల బృందం ఆహ్వానించింది.