సబ్‌జైలులోని ఖైదీలకు ఫోన్ సౌకర్యం
సబ్‌జైళ్ల జిల్లా అధికారి రామ్‌గోపాల్
మార్కాపురం : సబ్ జైలులోని ఖైదీలకు ఫోన్ సౌకర్యం కల్పిస్తున్నామని జిల్లా జైళ్ల అధికారి ఎం.రామ్‌గోపాల్ తెలిపారు. స్థానిక సబ్ జైలులో బుధవారం ఏర్పాటు చేసిన ఎస్టీడీ కాయిన్ బాక్స్ టెలిఫోన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తమ శాఖ డెరైక్టర్ జనరల్ తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాలో మొదటిసారిగా మార్కాపురం సబ్‌జైలుకు ఈ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. జైలులో ఉన్న ఖైదీలు కుటుంబ సభ్యులతో, న్యాయవాదులతో మాట్లాడుకోవచ్చన్నారు.
ఈ సౌకర్యం ప్రస్తుతం రాష్ట్రంలోని జిల్లా జైళ్లలో, సెంట్రల్ జైళ్లలో అమలవుతుందన్నారు. గిద్దలూరులో సబ్‌జైలు నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.80 కోట్లు మంజూరు చేసిందని ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా త్వరలో నిర్మాణ పనులు చేపడతామన్నారు. చీరాలలో సబ్‌జైలు నిర్మాణానికి ఎకరా స్థలాన్ని కేటాయించామన్నారు. జిల్లాలోని జైళ్లలో ఉన్న ఖైదీలకు వారంలో ఒక రోజు మాంసాహారం, కోడిగుడ్డు, అరటి పండు అందిస్తున్నామన్నారు. ప్రతి రోజు ఉదయం పూట ఖైదీలకు టిఫిన్ ఇస్తున్నామని చెప్పారు. ఆయన వెంట మార్కాపురం జైలు పర్యవేక్షణాధికారి అప్పలనాయుడు ఉన్నారు.