అస్తిత్వవాద కథంటే?
ఇది అస్తిత్వవాద యుగం. ఆదివాసులు, దళితులు, వెనుకబడిన కులాలు, మత అల్పసంఖ్యాకవర్గాలు, స్త్రీలు, కార్మికులు మాత్రమేగాక, భాషా, ప్రాంత, వర్ణ తదితర కారణాల వల్ల అణచివేతకు గురవుతున్న అసంఖ్యాక శ్రేణులు తమ విముక్తికోసం ఆరాటపడుతున్నాయి. తమతమ స్థాయుల్లో తమదైన శైలుల్లో పోరాడుతున్నాయి. సాహిత్యం చాలా పనులు చేస్తుంది కానీ, వాటన్నింటిలో మహత్తరమైనది అది అణగారిన శ్రేణులకు అండగా నిలబడడమే.
కష్టాల్లో ఉన్నవాళ్ల పక్షాన నిలబడాలనుకునే కవులు, రచయితలకు తెలుగునాట కొదవలేదు. తెలుగు సాహిత్యా నికి ఇది చాలా గొప్ప పార్శ్వం. అయితే, ఆశయం వేరు. గమనం వేరు. గమ్యం వేరు. చాలామంది రచయితలకు అస్తిత్వ శ్రేణుల మీద అపార అభిమానమున్నా వాళ్ల కథలు చాలా సందర్భాల్లో ప్రకటిత లక్ష్యాలను సాధించడంలేదు. దానికి కారణం ఏమంటే చాలామంది రచయితలు రచన నిర్మితిని అర్థం చేసుకోవడంలో విఫలం అవుతున్నారు.
రచనకు మౌలికంగా సందర్భం, సంఘర్షణ, పరిష్కారం (Setup, the Confrontation and the Resolution) అనే మూడు అంకాలు (three-act structure) వుంటాయనేది అందరికీ తెలిసిన అంశమే. అస్తిత్వవాద రచయితలు ఈ సంఘర్షణ అంకాన్ని మరింత లోతుగా అభ్యాసం చేయాల్సిన అవసరం వుంది.
ఒక అమ్మాయికి కష్టం వస్తే అది ఒక అమ్మాయి కథ అవుతుందిగానీ స్త్రీవాద కథో, పురుషాధిక్య కథో అవ్వదు. ఘర్షణ చట్రంలో ఆ అమ్మాయితోపాటూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఒక పురుషుడు ఉండాలి. ఆమె మీద పురుషాధిక్య అణచివేత కొనసాగిందనే నిరూపణ అయినప్పుడే అది స్త్రీవాద కథ అవుతుంది. ఆమె సాగించే పోరాటం విస్తృతమయితే మొత్తం స్త్రీజాతి విముక్తి చెందుతుందనే నమ్మకాన్ని పాఠకులకు కలిగిస్తే ఆ కథకు సార్వజనీనత కూడా సమకూరుతుంది. ఇదే సూత్రం ముస్లింవాద, దళితవాద, తెలంగాణవాద తదితర రచయితలకూ వర్తిస్తుంది.
కథలో పాత్రలన్నీ దళితులయినంత మాత్రాన అది దళిత కథ కానట్టే, కథలో పాత్రలన్నీ ముస్లింలు అయినంతమాత్రాన ఆ కథ ముస్లింవాద కథ కాదు. ఛార్లెస్ డికెన్స్ రచనల్లోని పాత్రలన్నీ దాదాపుగా క్రైస్తవులే. అంతమాత్రాన వాటిని క్రైస్తవవాద రచనలు అనలేం.
సిరిసిల్లలో ఒక సాలె అతను పేదరికంతో చనిపోతే అది తెలంగాణ కథ అవుతుంది కానీ తెలంగాణవాద కథ కాదు. ఎందుకంటే సిరిసిల్లలో సాలెవాళ్ళు పేదరికంతో చనిపోతున్నట్టే, ఆంధ్రాలో భట్టిప్రోలు, జాండ్రపేటల్లోనూ సాలెవాళ్ళు పేదరికంతో చనిపోతుంటారు. సిరిసిల్ల కథను తెలంగాణవాద కథగా మార్చాలంటే ఆ సాలెవాని చావుకు ఆంధ్రా ప్రాంతీయుల పాలన కారణమనే ఉపపత్తిని నిరూపించాల్సి ఉంటుంది. ఉద్యమాలు ఉధృతంగా సాగుతున్నప్పుడు ఇలాంటి రచనలన్నీ ఉద్యమ సాహిత్యంగా చలామణి అయిపోతుంటాయి. వీటిల్లో తప్పును ఎత్తిచూపడానికి కూడా సాహిత్య విమర్శకులు సాహసించరు.
ఘర్షణ చట్రంలోనికి పరస్పర విరుద్ధ శక్తుల్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రవేశపెట్టినప్పుడే అది అస్తిత్వవాద రచన అవుతుంది. జ్ఞానం అనేది ఆధిపత్య కులాల సొంత ఆస్తి కాదని చెప్పడానికి ‘జాగీరు’ కథలో పసునూరి రవీందర్ దళిత యువకుడ్ని ఏకంగా ఆధిపత్య కులస్తుడి ఇంట్లో ప్రవేశపెడతాడు. స.వెం. రమేశ్ కథ ‘పాంచాలమ్మ పాట’లో సునందత్త పాత్ర తనను మొగుడు చీట్లపేకాటలో ఫణంగా పెట్టి ఓడిపోయాడనీ, వాడికి మొగుడుతనం పోయిందనీ, తను ముండమోసాననీ తనే ఊర్లో డప్పుకొట్టి మరీ చాటి చెపుతుంది. ఇలాంటి ముఖాముఖి ఘర్షణ అస్తిత్వవాద రచనలకు వన్నె తెస్తుంది. పీవీ సునీల్ కుమార్ కథ ‘థూ’, వేంపల్లె షరీఫ్ ‘తలుగు’ కథల్లో మనం ఇలాంటి ఘర్షణను చూస్తాం.
ఘర్షణ చట్రంలోనికి పరస్పర విరుద్ధ శక్తుల్ని ప్రవేశపెట్టాలనే సూత్రం తెలిసిన రచయితలు సమర్థమైన అస్తిత్వవాద రచనలు చేస్తారు. ఆ సూత్రం తెలియనివాళ్ళు గాల్లో కలాలను ఝుళిపిస్తారు. అంతే తేడా. రచయితలకు లక్ష్యం వుంటే సరిపోదు లక్ష్యాన్ని సాధించే మెళకువలూ తెలియాలి. అస్తిత్వవాద రచయితలు ఉద్యమ నాయకుల్లా ఆలోచించాలి; ఉద్యమ అనుచరుల్లా కాదు.
- ఉషా ఎస్ డానీ
రచయిత, విమర్శకుడు
(‘ప్రాతినిధ్య కథ-2014’ ఆవిష్కరణ ప్రసంగంలో ఒక భాగం)