పోలీసులపై మరో భారం
శిథిలావస్థలో ఉన్న భవనాలను ఖాళీ చేయించే బాధ్యత ఇక ఖాకీలతే
- స్పష్టం చేసిన బాంబే హైకోర్టు
- బీఎంసీ పిటిషన్పై ఆదేశాలు
- మరిన్ని ఇబ్బందులో నగర ఖాకీలు
సాక్షి, ముంబై: ఇప్పటికే తలకుమించిన భారాన్ని మోస్తున్న పోలీసులకు బాంబే హైకోర్టు కొత్త బాధ్యతలు అప్పగించింది. శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించే బాధ్యత ఇకపై పోలీసులే తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలతో నగర పోలీసులపై అదనపు భారం పడనుంది. నగరంలో శిథిలావస్థకు చేరుకున్న భవనాలు అనేకం ఉన్నాయి. ప్రాణాలను ఫణంగా పెట్టి అందులో వేలాది కుటుంబాలు నివాసముంటున్నాయి. ఏటా వర్షా కాలానికి ముందు మహానగర పాలక సంస్థ (బీఎంసీ) పాత భవనాలపై స్ట్రక్చరల్ ఆడిట్ నిర్వహిస్తుంది.
ప్రమాదకర, అత్యంత ప్రమాదకర భవనాల జాబితా రూపొందిస్తుంది. ముందుగా అత్యంత ప్రమాదక భవనాల్లో ఉంటున్నవారికి ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేస్తుంది. అయితే చాలామంది ఈ నోటీసులను బేఖాతరు చేస్తున్నారు. పునరావాసం కల్పించిన చోట మౌలిక సదుపాయాలు, ఇతర వసతులు లేకపోవడం, లోకల్ రైల్వే స్టేషన్లు దూరంగా ఉండడం, పిల్లలకు పాఠశాలలు అందుబాటులో లేకపోవడం తదితర కారణాలవల్ల ఖాళీ చేయడంలేదు.
ప్రమాదమని తెలిసి కూడా శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లోనే ఉండే సాహసం చేస్తున్నారు. దీంతో ఈ విషయమై బీఎంసీ పరిపాలన విభాగం హైకోర్టును ఆశ్రయించింది. వారిని ఎలా ఖాళీ చేయించాలో న్యాయస్థానమే తెలపాలని కోరింది. దీనిపై స్పందించిన కోర్టు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.బీఎంసీ నోటీసులు జారీచేసినప్పటికీ భవనాల్లో బలవంతంగా ఉంటున్న వారిని ఖాళీ చేయించే బాధ్యత పోలీసులదేనని స్పష్టం చేసింది.
అయితే నివాసుల సామగ్రికి ఎలాంటి హానీ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఒకవేళ ఖాళీ చేసేందుకు నిరాకరిస్తే అందుకు ప్రత్యేకంగా ఒక ఉన్నత స్థాయి కమిటీ నియమించాలని, ఆ తరువాత విద్యుత్, నీటి సరఫరాను తొలగించాలని, అయినప్పటికీ వారు ఖాళీ చేసేందుకు మొండికేస్తే అప్పుడు పోలీసులను రంగంలోకి దించి బలవంతంగా ఖాళీ చేయించాలని సూచించింది. అవసరమైతే బలప్రయోగం ద్వారానైనా ఖాళీ చేయించాలని పోలీసులకు సూచించింది.