నా ఫొటో వాడుతారా.. దావా వేస్తా!
ఎందుకొచ్చిన బాధరా అంటూ కేరళ సర్కారు తల పట్టుకుంటోంది. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన 'నిర్భయ కేరళం సురక్షిత కేరళం' అనే కార్యక్రమ ప్రచార ప్రకటనలలో.. తన అనుమతి లేకుండా తన ఫొటో ఎలా ఉపయోగిస్తారంటూ ఓ మహిళ కేరళ సర్కారును నిలదీస్తున్నారు. సర్కారును కోర్టుకు ఈడుస్తానని బెదిరిస్తున్నారు. తన అనుమతి లేకుండా ఈ పథకానికి ప్రచారంలో తన ఫొటోను ఉపయోగించుకోవడంపై పరువునష్టం దావా వేయనున్నట్లు ఆమె చెప్పింది. ఇద్దరు బిడ్డల తల్లి అయిన ఆమె, భర్త మరణించాక బహ్రెయిన్‌లో ఉద్యోగం చేసుకుంటోంది. ఈ వివాదం నేపథ్యంలో ప్రకటనను రూపొందించిన ప్రజా సంబంధాల శాఖ నుంచి రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి కేసీ జోసెఫ్ వివరణ కోరారు.
కేరళ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా భావించిన ఈ పథకాన్ని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ గతవారం కొచ్చిలో ప్రారంభించారు. మరో ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె ఉన్నట్లున్న ప్రకటన స్థానిక దినపత్రికలలోప్రముఖంగా దర్శనమిచ్చింది. దీంతో ఆమె స్నేహితులు ఫోన్ చేసి, మోడలింగ్‌కు వెళ్లావా అని అడగడంతో ఆమె దిగ్భ్రాంతి చెందింది. ఇంటర్నెట్ లోంచి ఆమె ఫొటోను తీసుకున్నట్లు పౌరసంబంధాల శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు.