సుకీ...
మెట్రో కథలు
మూడు రోజుల తర్వాత వార్త తెలిసి ఆమె మంచం పట్టింది.
సుకీ గొంతు దాదాపు పోయిందట. ఆగకుండా మొరిగీ మొరిగీ ఏమై పోయి ఉంటుందో ఊహించుకుంటే ఆమెకు అన్నం ముద్ద దిగడం లేదు. బాగా బరువు తగ్గిపోయిందట. అప్పటికీ చెప్పి చెప్పి పంపింది- సుకీ ఏదంటే అది తినదూ దానికి బ్రెడ్ ఇష్టం రెండు పూటలా అదే పెట్టండీ అని. రొట్టె పెట్టారట. అది పొరపాటున కూడా మూచూడదు. తలుపు ఏ కాస్త అలికిడైనా తన వాళ్లు వచ్చారేమోనని ఉలికులికి పడుతోందనీ నిద్ర పోవడంలేదనీ కదలిక ఏమీ లేనట్టుగా శవంలాగా పడి ఉంటోందనీ...
మీరు వెళ్తారా నన్ను వెళ్లమంటారా? అని ఆమె పెద్దపెద్దగా ఏడ్చింది. ఎవరు మాత్రం సమాధానం చెప్తారు. వెళ్లినా లాభం లేదు. తెచ్చుకున్నా మళ్లీ పంపాల్సిందే. అపార్ట్మెంట్లో ఉన్న ఇతర ఫ్లాట్స్ వాళ్లకు కూడా ఇదంతా సతమతంగా ఉంది.
మొదట ఆ ఫ్లాట్ మీద ఎవరి దృష్టీ లేదు. జనరల్‌బాడీలో తెలిసింది- కార్పస్ ఫండ్ కట్టలేదని, ఎమినిటీస్‌కు కట్టాల్సింది కూడా కట్టకుండానే ఆక్యుపై చేసుకున్నారనీ, మెయింటెనెన్స్‌కు వాచ్‌మెన్‌ను పదేపదే తిప్పుతున్నారనీ....
అతను అప్పుడప్పుడు నీలిరంగు కోటు వేసుకుని గ్రే కలర్ ప్యాంట్ లెదర్ షూస్ కట్టుకుని టైతో బైక్ మీద వెళుతూ కనిపించేవాడు. టూ బెడ్ రూమ్ ఫ్లాట్‌లో ఉంటున్నవాళ్లు అలాంటి కోటు వేసుకోవడం ఏమిటో తెలియలేదు. ఆమె రోజూ వాకింగుకు కిందకు దిగినప్పుడల్లా పొద్దున కానీ సాయంత్రం కానీ వాచ్మెన్నో సెక్యూరిటీ గార్డ్నో ఏదో ఒకటి అనకుండా పైకి వెళ్లేది కాదు. అలా వాళ్లు అందరికీ తెలుసు. సుకీ వల్ల కూడా.
మూడు నెలల వయసులో కార్ పార్కింగ్ దగ్గర అది సిట్ అంటే కూచుంటూ స్టాండ్ అంటే నిలబడుతూ అందరికీ కనిపించింది. చిన్న చిన్న బిస్కెట్లను ఇంకా చిన్న ముక్కలు చేసి అలా గాల్లోకి ఎగరేస్తే ఒక్కటి కూడా కింద పడకుండా నోట కరుచుకుని మరొక ముక్క కోసం కళ్లల్లో కళ్లు పెట్టి చూసేది. ముద్దుగా ఉండేది. ఎవరితోనైనా స్నేహం చేసేలా అనిపించేది.
ఫ్లాట్స్‌లో కుక్క ఏమిటండీ అని వాళ్లూ వీళ్లూ అన్నారు.
ఆమె సమాధానం చెప్పే పని కూడా పెట్టుకోలేదు.
రోజూ ఆమె సుకీతోనే కనిపించేది. మంచి బెల్ట్ వేసి కుడి చేత్తో పట్టుకుని... ఆరు నెలల వయసుకు వచ్చి అది గునగున నడుస్తూ ఉంటే ఆమె అలా హైవే వరకూ వెళ్లి వచ్చేది. పిల్లలు ఆమెను చూసి భయపడేవారు. కాని సుకీకి కాలక్షేపంగా ఉంటుందని ఆమె వాళ్లను దానితో ఆడుకోనిచ్చేది. వాళ్లు ఉత్సాహంగా బిస్కెట్లో మరోటో పట్టుకుని వచ్చేవారు.
మా గాడ్దికి తిండి యావ ఎక్కువ. లాబ్రడార్ కదా. బాగా తింటుంది. పెట్టండి అనేది.
అది ఖరీదైన కుక్క అని అన్నారు. కొనాలంటే కనీసం ఇరవై వేలు ఉంటుందని చెప్పారు. కాదు ఎవరో తెలిసినవాళ్లు ఇస్తే తెచ్చుకుని ఉంటారు అని కూడా వినబడింది. దీని ఖర్చు నెలకు ఎంత లేదన్నా వెయ్యీ పదిహేను వందలు ఉంటుందట. ఇవి కాకుండా వాక్సిన్లు మందులూ జీర్ణానికి టానిక్కులూ డాక్టర్ విజిట్ కోసం ఆటోలో వేసుకొని వెళ్లడానికి అదొక ఖర్చూ...
అయితే ఆమె అదంతా పెద్ద పట్టించుకున్నట్టు కనపడేది కాదు. కొడుకు ఈ మధ్యే ఏదో ప్రయివేట్ బ్యాంక్‌లో చిన్న ఉద్యోగానికి చేరాడట. ఇంట్లో దాదాపు ఉండడు. కూతురు పెళ్లయి వెళ్లిపోయిందని అంటారు.
ఇది నా కొడుకు. ఇదుంటే చాలు అంటుంటుంది ఆమె.
సుకీ ఆమెను వదలదు. ఉదయం ఏడింటికి నిద్ర లేచి బద్దకంగా కన్ను తెరిస్తే ఈమె కనిపించాలి. లేకుంటే అపార్ట్మెంట్ మొత్తం ఊగేలాగా గోల చేసేస్తుంది. ఈమె కిచన్లో ఉంటే ఏం వండుతున్నావే అన్నట్టుగా అక్కడే ఉంటుందట. బట్టలు తెచ్చుకోవడానికి టై మీదకు వెళ్లాలన్నా తోకలాగా వెంట తీసుకువెళ్లాల్సిందే. ఎప్పుడూ పక్కన కూచుంటుంది. రెండు బుగ్గలకూ మూతిని తాకిస్తుంది. ఇంట్లో మాట్లాడ్డానికి మనిషి లేక కబుర్లు చెబుతూ ఉంటే చెప్పుకోవే అన్నట్టు వింటూ ఉంటుంది. దానికి ఆమె గురించి పట్టింపులు జాస్తి. అన్నం తినక ఏ పనుల్లోనో పడి మర్చిపోతే తిను అని గద్దించి చెప్తుంది. టీ టైమ్ గుర్తు చేస్తుంది. సాయంత్రం కిందకు తీసుకువెళితే పిల్లలందరితో రండ్రా చిన్నయ్యలూ అని దానికి ఎంత ఆటో. సైకిళ్లు తొక్కే పిల్లలను ఓడిస్తుంది. ప్రేమగా తాకే పిల్లలను మాటా పలుకూ లేకుండా ముచ్చటగా చూస్తూ తోక ఆడిస్తూ ఉంటుంది.
తొమ్మిది నెలలు వచ్చేసరికి పెద్దవాళ్లకు కూడా ఫ్రెండ్ అయిపోయింది. కొందరు పొద్దున దానిని చూస్తారు. కొందరు మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు పలకరిస్తారు. కొందరు రాత్రి నిద్రకు ముందు పచార్లకు దిగినప్పుడు దానికి గుడ్ నైట్ చెప్పి చెయ్యూపుతూ నవ్వుతూ ఫ్లాట్లలోకి వస్తారు. ఎంత అలవాటు అంటే ఆఖరకు దాని కోసం సుకీ ఎక్కడండీ అని ఆమెతో మాట్లాడటానికి కూడా సిద్ధమైపోయారు.
అయితే సుకీ కూడా ఆమెను బాగా గడబిడగా ఉంచేది. బాత్రూమ్ బయట ఉంచిన స్లిప్పర్లను చీల్చి అవతల పారేసేది. దిండును నోట కరుచుకుందంటే ఎంత లాగినా దిండు చిరగాల్సిందే తప్ప అది పట్టు వదలదు. ఆకలేస్తే అడగొచ్చుగా. ఊహూ. ఒక్కోసారి కుర్చీ మీద లంఘించి అక్కణ్ణుంచి డైనింగ్ టేబుల్ మీదకు దూకి గిన్నెలు దొర్లించి...
ఆ...య్... సుకీ... అని గట్టిగా కేకలేస్తే చాలు. ఇంకంతే మూలకు వెళ్లి దన్‌మని పడి పోతుంది. ఉలకదు. పలకదు. పోవే టక్కరిదానా అని ఆమె కూడా లెక్క చేయకుండా ఉంటుంది. అతనుంటే కాసేపు సరదా కోసం దానిని బతిమిలాడేవాడు. పట్టించుకోదు. కొడుకు ఉంటే బుజ్జగించేవాడు. కన్నెత్తి కూడా చూడదు. ఇక చూసి చూసి ఆమే వచ్చి సరేలే... రా... తిను... అని కాస్త పెరుగన్నం కలిపి తినిపించడానికి కూచుంటే అది కాళ్లూ చేతులు వెల్లికిలా పడేసి... సారీ... సారీ... అని ముఖం ప్రసన్నంగా పెట్టేదాకా మారాం చేస్తుంటే ఆమె నవ్వుతూ నువ్వొకదానివి దాపురించావే నా ప్రాణానికి అని కళ్ల చివర తుడుచుకునేది. నిన్ను వదిలి బతగ్గలనా అని దగ్గరకు తీసుకునేది.
కాని- అలాంటి సందర్భం వచ్చి పడింది. స్టేట్ డివైడ్ అయ్యాక అతడి పరిస్థితి కొంచెం బాగ లేదు. రియల్ ఎస్టేట్‌లో అతను చేసే మార్కెటింగ్ ఫీల్డ్ దెబ్బ తినిందట. మరి ఇక్కడ ఇబ్బంది వచ్చిందో అక్కడ ఇబ్బంది వచ్చిందో ఈ రాజధానికీ ఆ రాజధానికీ క్షణం తీరిక లేకుండా తిరుగుతున్నా ప్రతిఫలం లేదు. ఇంటి లోను ఒకటి కట్టాలి. ఖర్చులు చూడాలి. ఏవో చిన్నా పెద్ద అప్పులు ఉన్నట్టున్నాయ్. అవి తీర్చాలి. ఇక ఇలాగే ఉంటే అవదని బయటకు వెళ్లి ఏదో ఒకటి చేయాలని ఆమె నిశ్చయం తీసుకుంది. మరి సుకీ? మనిషి లేని ఇంట్లో అది క్షణం కూడా ఉండలేదు. ఉత్త బెదురుపోతు. లోపల పెట్టి తాళం వేసి పోతే మొరిగీ మొరిగీ సాయంత్రం లోపల ఠారున చచ్చిపోతుంది.
పర్లేదు... నా ఫ్రెండ్ ఉన్నాడు. ఇస్తానంటే వచ్చి వాళ్లూరు తిసుకెళతానంటున్నాడు. మన పరిస్థితి బాగు పడ్డాక తెచ్చుకుందాం అన్నాడతను. దాని మీద రెండు వారాలు నాలుగు వారాలు
పెద్ద పెద్ద చర్చలు... ఏడుపులు అయ్యాయి. సరే... కనీసం
ఆరు నెలలు అని ఒప్పందం కుదిరింది. స్నేహితుడు వచ్చాడు. కారులో తీసుకెళ్లిపోయాడు. మూడో రోజుకల్లా ఆమె మంచం పట్టింది.
సుకీ... సుకీ...
అన్నం మానేసింది. రెప్ప మూతపడితే నిద్రలో దాని కలలు. మంచం పక్కన రోజూలాగే పడుకుని ఉందేమో అన్నట్టుగా పదేపదే ఉలికిపడుతూ లేచి చూసేది. కాని అది ఎందుకు ఉంటుంది?
అది నా కోసం ఏడుస్తూ ఉంటుందండీ... నేను లేకపోతే బతకదండీ...
ఎంత ఏడ్చినా ఏం లాభం. ప్రస్తుతానికి పరిస్థితి అది.
రెండు మూడు వారాలు గడిచాయి. మెల్లగా ఆమె అప్పుడప్పుడు కింద కనిపించడం మొదలుపెట్టింది. పిల్లలను చూసి తల దించుకుని వెళ్లిపోతూ ఉండేది. పెద్దవాళ్లతో కూడా ఏదో మొహమాటపు పలకరింపే.
మొన్నొక రోజు రాత్రి కింద సుకీ ఇష్టంగా కూచునే మొక్కల దగ్గర కూచుని ఆమె ఎంతసేపటికీ కదల్లేదు. గేట్లు వేసేసే టైమ్ వచ్చినా కదల్లేదు. భర్త చూసి చూసి కిందకు వచ్చాడు.
ఇంకా ఎన్ని రోజులు ఏడుస్తావు?
ఆమె పసిపిల్లలా చూస్తూ మెల్లగా ఏడవడం మొదలుపెట్టింది.
పాపిష్టిదాన్ని... బిడ్డలాగా పెంచి చేతులారా సాగనంపాను... దాని ఉసురు పోసుకున్నాను. ఒసే గాడిద్దానా... నేనింక నిన్ను సాకలేను వాళ్ల పంచనా వీళ్ల పంచనా పడి బతుకమ్మా... ఇంక నన్ను వదిలిపెట్టు అని నిజం చెప్పేసి ఉంటే అది అంతా అర్థం చేసుకుని అలాగే అంటూ నా కళ్లవైపు కూడా చూడకుండా వెళ్లిపోయేదేమో. కాని మోసం చేశాను. పోవే... అంకుల్ వాళ్లతో అలా షికారుకు పోయిరా అని అబద్ధం చెప్పి పంపించాను. తర్వాత ఎంత కంగారు పడి ఉంటుందో. ఎంత బెదిరిపోయి ఉంటుందో. ఇంత నమ్మకద్రోహం చేస్తావా అని నా మీద కోపం పెట్టుకుని ఎంత అలిగి ఉంటుందో. అయ్యో... నేనెప్పుడు కనపడేది... దాని అలక ఎప్పుడు తీర్చేది... టక్కరిది టక్కరిది అని పిలిచేదాన్నే.... అసలైన టక్కరిదాన్ని నేనే కదా...
ఏమీ రాద్ధాంతం చేయకుండా చాలా లోగొంతుకతో ఆమె పొగిలి పొగిలి ఏడుస్తూ ఉంటే ఆ గిల్ట్ ఈ జన్మకు సరిపడినదా అనిపించింది.
- మహమ్మద్ ఖదీర్‌బాబు