ప్రజాస్వామ్యాన్ని మంటగలిపిన టీడీపీ
- ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
నాయుడుపేటటౌన్: టీడీపీ ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి సాక్షాత్తు కలెక్టర్ ఎదుట వీధిరౌడీల్లా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని మంటగలిపారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ధ్వజమెత్తారు. స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యేల తీరును ఖండించారు. టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహారశైలి సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు.
వైఎస్సార్‌కాంగ్రెస్ జెడ్పీటీసీలను ప్రలోభపెట్టడమే కాకుండా దౌర్జన్యంగా జిల్లా ఉన్నతాధికారుల ఎదుటే బతవంతంగా లాక్కెళ్లడం కంటే దారుణం మరొకటి ఉండదన్నారు. కలెక్టర్‌కే భద్రత కల్పించలేని టీడీపీ ప్రభుత్వం ఇక సామాన్యులకు ఏమి రక్షణ కల్పిస్తుందని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ మహిళా ప్రజాప్రతినిధులను చీరలు పట్టుకుని లాగి అత్యంత అనైతికంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. ప్రజలు చొక్కాలు పట్టుకుని ప్రశ్నించే స్థాయికి టీడీపీ ఎమ్మెల్యేలు దిగజారవద్దని ఆయన హితవు పలికారు.
టీడీపీ ఎమ్మెల్యేలపై ఎన్నికల ముఖ్య అధికారులు, డీజీపీ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ కార్యవర్గ సభ్యులు ఓడూరు గిరిధర్‌రెడ్డి, మండల కన్వీనర్ తంబిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, నాయకులు మురారిశెట్టి పాండురంగయ్య, తంబిరెడ్డి బలరామిరెడ్డి, దొంతాల రాజశేఖర్‌రెడ్డి, అన్నమనేని రామకృష్ణ, గంధవల్లి సిద్దయ్య, దుప్పల రవీంద్ర, కరీంబాయి హరిబాబు, ముప్పాళ్ల జనార్దన్‌రెడ్డి, మైలారి నాగరాజు, నాగార్జున పాల్గొన్నారు.