సోలార్ ఇప్పుడు లాభసాటే..!
♦ ‘ఫస్ట్సోలార్’ ఇండియా హెడ్ సుజోయ్ ఘోష్
♦ ఉపకరణాల ధరలు, వడ్డీ రేట్లు తగ్గిన ఫలితం
♦ అందుకే అంతర్జాతీయ దిగ్గజాల పోటాపోటీ
♦ ధర యూనిట్‌కు రూ.5-6 మధ్య ఉంటే లాభాలు
♦ ఏపీ, తెలంగాణల్లో 200 మెగావాట్ల ప్లాంట్లు
♦ దేశంలో మరో 800 మె.వా. ఉపకరణాల విక్రయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో ; సోలార్ విద్యుత్!! ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయ బ్యాంకులు, కంపెనీలు ప్రత్యేకంగా దృష్టిపెట్టడంతో ధరలు దిగొస్తున్నాయి. సోలార్ ఉపకరణాల ధరలతో పాటు వడ్డీరేట్లూ తగ్గటంతో యూనిట్‌ను రూ.5 కన్నా తక్కువ కే సరఫరా చేస్తామని అంతర్జాతీయ సంస్థలు పోటీపడుతున్నాయి. ఫస్ట్ సోలార్, సన్- ఎడిసన్, సాఫ్ట్‌బ్యాంక్, ఫోర్టమ్ ఓవైజే వంటి అంతర్జాతీయ దిగ్గజాలు రూ.5 కన్నా తక్కువకే సరఫరా చేసేందుకు ఒప్పందాలు చేసుకుని ప్లాంట్లు నిర్మిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణల్లో ప్రాజెక్టులు చేపట్టిన అమెరికన్ దిగ్గజం ఫస్ట్ సోలార్ ఇండియా హెడ్ ‘సుజోయ్ ఘోష్’ హైదరాబాద్‌లోని ‘సాక్షి’ కార్యాలయానికి వచ్చారు. వివిధ అంశాలపై ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ...
♦ మీరు రెండు రాష్ట్రాల్లోనూ ప్రాజెక్టులు చేపట్టినట్లున్నారు?
అవును! తెలంగాణకొస్తే మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు, రంగారెడ్డిలో ఒకటి చేపట్టాం. వీటి సామర్థ్యం 120 మెగావాట్లు. దీన్లో 70 మెగావాట్ల నిర్మాణం పూర్తయింది. 50 మెగావాట్లు వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్, చిత్తూరు జిల్లాల్లో తలా 40 మెగావాట్ల ప్లాంట్లను నిర్మించాం.
♦ సోలార్‌పై కొన్నేళ్లుగా ఫోకస్ పెట్టినా ఆశించినంత పెరగలేదుగా?
నిజమే! ధరే ప్రధానం. ఇపుడు వడ్డీరేట్లతో పాటు ఉపకరణాల ధరలూ తగ్గాయి. యూనిట్‌కు రూ.5.50 దాటితే ఉత్పత్తిదారుకు లాభాలొచ్చే పరిస్థితి ఉంది. అందుకని కంపెనీలు కూడా ముందుకొస్తున్నాయి. ఇకపై సోలార్ వాటా వేగంగా పెరుగుతుందనే నమ్మకం మాకుంది.
♦ సోలార్ లెక్కలు లాభసాటివేనా?
ప్రస్తుతం ఒక మెగావాట్ విద్యుత్‌కు 4 ఎకరాల భూమి కావాలి. భూమిని మినహాయిస్తే రూ.5 కోట్లవరకూ పెట్టుబడి కావాలి. 30 శాతం సొంతగా పెట్టుకుని మిగిలింది 11.5 శాతం వడ్డీకి అప్పు తీసుకున్నా... లాభాల్లోనే ఉండొచ్చు. ఎందుకంటే పీఎల్ఎఫ్ 24 శాతం వరకూ ఉంటుంది. ప్లాంటు జీవితకాలం 25 ఏళ్లు. వడ్డీ కనక తక్కువైతే కాస్త ఎక్కువ లాభాలొస్తాయి.
♦ మరి సోలార్‌తో రేడియేషన్ వస్తుందనే అపోహలున్నాయి?
మీరన్నట్టు అవి అపోహలే. సోలార్‌తో ఎలాంటి నష్టాలూ లేవు. భూమి ఎక్కువ కావాలన్నది కాదనలేని నిజం. దానికితోడు కనీసం 20 రోజులకోసారి ప్యానెళ్లను క్లీన్ చెయ్యాలి కనక నీళ్లు కావాలి. వర్షాకాలంలో ఆ అవసరం ఉండదు. వెనకబడిన ప్రాంతాల్లోనే భూమి లభ్యమవుతుంది కనక అక్కడే ప్లాంట్లు వస్తున్నాయి. వారిలోనే ఈ అపోహలున్నాయి.
♦ ఫస్ట్సోలార్ విషయానికొద్దాం. దేశీ ఎనర్జీ మారె ్కట్‌లో మీ వాటా?
సొంతంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో 200 మె.వా. ప్లాంట్లు వస్తున్నాయి. వీటిలో కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. మరో 800 మె.వా. విద్యుత్‌కు సంబంధించి ఫోటో వోల్టాయిక్ టెక్నాలజీని విక్రయించాం. ప్రస్తుతం వెయ్యి మెగావాట్ల వాటా మాది. 2022 నాటికి లక్ష మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను సాధించాలన్న కేంద్ర లక్ష్యానికి అనుగుణంగా వేగంగా అడుగులేస్తున్నాం.
♦ మీకిప్పుడు మలేసియా, అమెరికాల్లోనే తయారీ ప్లాంటున్నాయి. ఇండియాలో కూడా పెడతారా?
భారతదేశం తయారీకి అద్భుతమైన ప్రాంతం. కాకపోతే ప్లాంటు పెట్టాలంటే మంచి పోర్టు, హైక్వాలిటీ విద్యుత్, కాస్త అనుకూలంగా ఉండే పన్నుల విధానం ఉండాలి. ప్రస్తుతం మాకు మలేసియాలో ఏటా 2,800 మెగావాట్ల పీవీ మాడ్యూల్స్ తయారీ సామర్థ్యం ఉంది. దాన్ని డిమాండ్ అధిగమిస్తే ఇండియావైపే చూస్తాం.
♦ ప్రభుత్వాలు థర్మల్కిస్తున్న ప్రాధాన్యం సోలార్కు ఇస్తున్నాయా?
అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాల నేపథ్యంలో ఇపుడిది తప్పనిసరి. ప్రతి రాష్ట్రం నిర్దిష్ట శాతం సంప్రదాయేతర ఇంధనాన్ని కొనుగోలు చేయాలి. ఈ విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు క్రియాశీలకంగా ఉన్నాయి.
♦ తెలంగాణతో యూనిట్ రూ.6.49కి, కర్ణాటకతో రూ.5.49కి విక్రయించేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ తేడాలెందుకు?
తెలంగాణలో ఏడాది కిందట ఒప్పందం చేసుకున్నాం. ఇది 20 ఏళ్లపాటు విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఒప్పందం. ఇక కర్ణాటక ఒప్పందం ఈ మధ్యే జరిగింది. పరిస్థితులు మారటం వల్లే ధర కూడా తగ్గించాం.
♦ మీ భవిష్యత్ వ్యూహమేంటి?
ఏపీ, తెలంగాణల్లో కొత్త అవకాశాలొస్తే చేపడతాం. 25 ఏళ్ల స్థిర చార్జీల విధానంలో ముందుకెళుతున్నాం. ధరలు తగ్గటంతో ఐటీ కంపెనీలూ రూఫ్‌టాప్ సోలార్‌వైపు చూస్తున్నాయి. ఇళ్ల వినియోగదారుల్లోనూ అవగాహన పెరుగుతోంది. గ్రిడ్‌కు సంధానించే రూఫ్‌టాప్ సోలార్కు 15% సబ్సిడీ కూడా ఉంది. సోలార్‌తో పగటిపూట విద్యుదుత్పత్తి సాధ్యమవుతుంది. పగలే డిమాండ్ ఎక్కు వ.. దానికితోడు రైతులూ పగటి విద్యుత్ అడుగుతున్నారు. అందుకే ప్రభుత్వాలూ థర్మల్‌కు తోడుగా సోలార్‌వైపు చూస్తున్నాయి. ఈ రంగంలో లీడర్‌గా మాకు ఎక్కువ అవకాశాలుంటాయి.