విద్యుత్ రంగంలోకి ‘ఎంటర్ ది వరల్డ్ బ్యాంక్’ షరతులు వర్తిస్తాయా.. ?
ఫసియుద్దీన్
హైదరాబాద్ : ప్రపంచబ్యాంకు, విద్యుత్ రంగం అనే రెండు పదాలను జంటగా వినాల్సి వస్తే తెలుగు ప్రజలకు ఆటోమేటిగ్గా షాక్ తగులుతుంది. విద్యుత్ సంస్కరణల కోసం అప్పటి సీఎం చంద్రబాబు ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తీసుకోవడం, ఆ బ్యాంకు షరతులను అమలుచేసి ప్రజా కంటక పాలకుడిగా ముద్రపడిపోవడం ఇంకా మన జ్ఞాపకాల్లోంచి జారిపోలేదు. ఇన్నాళ్లకు మళ్లీ తెలంగాణ విద్యుత్ రంగం వాకిట్లోకి ప్రపంచ బ్యాంకు వచ్చి నిలబడింది. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ప్రపంచ బ్యాంకు అధికారులు చర్చలు జరుపబోతున్నారనేది విశ్వసనీయ సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన యాదాద్రి థర్మల్ కేంద్రం నుంచి విద్యుత్ సరఫరా చేసే లైన్ల నిర్మాణం కోసం రూ.4 వేల కోట్లను ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా సమకూర్చుకోవడం ప్రభుత్వ తొలి లక్ష్యం. అంతేగాకుండా నష్టాల్లో ఉన్న డిస్కంలను లాభాల బాటలో పడవేసేందుకు కూడా రెండో దశలో రుణం తీసుకునే అవకాశముందని చెబుతున్నారు. ప్రపంచ బ్యాంకు రుణం అనగానే కన్సల్టెన్సీలు, వాటి కర్రపెత్తనం ఉండి తీరుతుంది. మరి అలాంటివేమీ లేకుండా తెలంగాణ ప్రభుత్వానికి మినహాయింపులు ఉంటాయా? లేక షరా మామూలుగానే ప్రపంచ బ్యాంకు షరతులు వర్తిస్తాయా..? వేచి చూడాలి..
రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ సరఫరా లైన్ల నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ దిశగా ఇప్పటికే పలుమార్లు ప్రపంచ బ్యాంకుతో సంప్రదింపులు జరిపిన ప్రభుత్వం... అధికారికంగా చర్చలు జరిపేందుకు సమాయత్తమవుతోంది. రాష్ట్ర అధికారులు గురువారం ప్రపంచ బ్యాంకు బృందంతో సమావేశమై రుణ ఒప్పందంపై చర్చలు జరపనున్నారు.
నల్లగొండ జిల్లా దామరచర్లలో 4,000 మెగావాట్ల సామర్థ్యంతో ‘యాదాద్రి’ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని టీజెన్‌కో చేపట్టిన విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి విద్యుత్ సరఫరా లైన్లను నిర్మించేందుకు ప్రపంచ బ్యాంకు నుంచి రూ.4 వేల కోట్ల రుణాన్ని సమీకరించేందుకు అధికారులు సంప్రదింపులు ప్రారంభించారు. తదుపరి దశల్లో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల కోసం ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవాలన్న ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నట్లు తెలిసింది.
అయితే చంద్రబాబు హయాంలో తప్పితే ఆ తర్వాత విద్యుత్ రంగంలో ప్రపంచ బ్యాంకు రుణం స్వీకరించిన దాఖలాలు లేవు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ, వినియోగదారులకు సబ్సిడీలు నిలిపేయాలన్న ఆంక్షలతో నాడు ప్రపంచ బ్యాంకు చంద్రబాబు సర్కారుపై పెత్తనం సాగించింది. అలాంటిది తాజాగా టీఆర్ఎస్ సర్కారు.. ప్రపంచ బ్యాంకు రుణం కోసం ప్రయత్నిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో వరల్డ్ బ్యాంకు ఝలక్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగ పునర్నిర్మాణ పథకం పేరుతో 1996లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుంచి బిలియన్ డాలర్లు (అప్పటి లెక్కన సుమారు రూ.4,200 కోట్లు) రుణాన్ని సమీకరించింది. ఈ రుణాన్ని నాలుగు దశల్లో చెల్లించాలని, ప్రతి దశలో నియమ నిబంధనలన్నీ పాటించాల్సి ఉంటుందని ప్రపంచ బ్యాంకు రూపొందించిన ఆంక్షల ఒప్పందంపై బాబు సర్కారు సంతకాలు చేసింది.
ఆ ఒప్పందం తొలిదశలో భాగంగానే ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు 3 ముక్కలై జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంలుగా ఏర్పడ్డాయి. రెండోదశలో విద్యుత్ చార్జీలు భారీగా పెంచేసి, ఆ తర్వాత డిస్కంలను ప్రైవేటీకరించాల్సి ఉండగా.. ఆ దిశగా ప్రభుత్వం పావులు కదిపింది. 2000 జూలై లో భారీగా విద్యుత్ చార్జీలను పెంచేసింది. సగటున 15 శాతం చార్జీలు పెరిగినప్పటికీ గృహాలపై 100 శాతం, రైతులపై 50 శాతం అదనపు భారం పడింది. ఆ తర్వాత డిస్కంల ప్రైవేటీకరణ జరపాలన్న షరతు అమలుకు చంద్రబాబు సర్కారు ప్రయత్నించింది. అయితే విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ... 2000 ఆగస్టు 28న కాంగ్రెస్, వామపక్షాలు చలో హైదరాబాద్ పేరుతో లక్షల మందితో ఆందోళనకు దిగాయి.
ఈ ఆందోళనకారులపై బషీర్‌బాగ్ వద్ద పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురు మృతిచెందారు, వందల సంఖ్యలో గాయాల పాలయ్యారు. ఈ ఘటనతో బాబు సర్కారు డిస్కంల ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గింది. దాంతోపాటు ఒరిస్సాలో డిస్కంల ప్రైవేటీకరణ విఫలం కావడంతో వేచి చూడాలని నిర్ణయించింది. ఈ సమయంలో ప్రపంచ బ్యాంకు ఆంక్షలకు వ్యతిరేకంగా నాటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో ఉద్యమాలు మొదలయ్యా యి. రైతులకు ఉచిత విద్యుత్ నినాదంతో వైఎస్ 2004 ఎన్నికల్లో విజయం సాధించారు. ఉచిత విద్యుత్ ఫైల్‌పై తొలి సంతకం చేశారు.
చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకున్న డిస్కంల ప్రైవేటీకరణ ఒప్పందాన్ని అమలు చేయడానికి వైఎస్సార్ నిరాకరించారు. స్వదేశీ బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నప్పుడు ప్రపంచ బ్యాంకు ముందు మోకరిల్లాల్సిన అవసరం లేదని బహిరంగంగా ప్రకటించారు. ఆ తర్వాత ప్రభుత్వాలేవీ విద్యుత్ రంగంలో ప్రపంచ బ్యాంకు రుణానికి సాహసించలేదు. అలాంటిది ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి ఆర్ఈసీ, పీఎఫ్సీ లాంటి సంస్థలు రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నా.. ప్రపంచ బ్యాంకు రుణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
విపరిణామాలు ఎన్నో..
ఆర్ఈసీ, పీఎఫ్‌సీల రుణాల ఖర్చులపై విద్యుత్ సంస్థలకు స్వేచ్ఛ ఉంటుంది. అదే ప్రపంచ బ్యాంకు ఎన్నో ఆంక్షలు పెడుతుంది. ఆ బ్యాంకు కన్సల్టెన్సీల పర్యవేక్షణలో ప్రాజెక్టు అమలు చేయాలి. అంతర్జాతీయంగా ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్న సంస్థలకు అనుకూలంగా ఈ కన్సల్టెన్సీలు బిడ్ డాక్యుమెంట్లో నిబంధనలను చొప్పిస్తాయి. దేశీయ కంపెనీలు టెండర్లలో పాల్గొనకుండా చేస్తాయి.
ఈ రుణాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారెంటీ, కౌంటర్ గ్యారెంటీలు ఇవ్వాలి. ప్రపంచ బ్యాంకు వడ్డీలు తక్కువ అని ప్రభుత్వాలు ప్రచారం చేసుకుంటాయి. కానీ విద్యుత్ సంస్థలపై వడ్డీల భారం తడిసి మోపెడు కానుంది. ఈ రుణం ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్రానికి, కేంద్రం నుంచి రాష్ట్రానికి, ఆ తర్వాత విద్యుత్ సంస్థలకు చేరుతుంది.
అంతేగాకుండా రుణం డాలర్లలో ఇచ్చే నేపథ్యంలో.. మారకపు విలువలో హెచ్చుతగ్గుల భారం విద్యుత్ సంస్థలపై పడుతుంది. రూ.5 కోట్లకు మించి విద్యుత్ సంస్థలు చేసే ఖర్చును విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) నియంత్రిస్తుంది. కానీ ప్రపంచ బ్యాంకు విషయంలో ఈఆర్సీదీ ప్రేక్షక పాత్రే. ప్రపంచ బ్యాంకు సూపర్ రెగ్యులేటరీ కమిషన్‌గా అజమాయిషీ చెలాయించేందుకు ప్రయత్నిస్తుంది.