ఇక పెద్దల వంతు
- ట్రేజరీ స్కాంలో స్వప్నకుమారి అరెస్టు
- మరో ఇద్దరు ఉన్నతోద్యోగులపై చర్యలు
- ఆధారాలతో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- డీటీవో పాత్రపైనా విచారణ!
- కుదిపేస్తున్న ఖజానా కుంభకోణం
మహారాణిపేట(విశాఖ): చింతపల్లి ఖజానా కుంభకోణం ఆరోగ్య, ఖజానాశాఖల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ స్కామ్‌లో15 మందిని అరెస్టు చేసిన పోలీసులు గురువారం రాత్రి అప్పటి పాడేరు ఏడీఎంహెచ్‌వో స్వప్నకుమారిని 16వ నిందితురాలిగా అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. హైదరాబాద్ డెరైక్టర్ ఆఫ్ పబ్లిక్‌హెల్త్ కార్యాలయంలో కూడా ఈ అవినీతి కుంభకోణానికి మూలాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అప్పటి డీఎంహెచ్‌వోతో పాటు డెరైక్టర్ ఆఫ్ పబ్లిక్‌హెల్త్ కార్యాలయంలో కీలకమైన అధికారి అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రూ.8కోట్ల మేర కుంభకోణంపై క్రైం డీఎస్పీ కృష్ణవర్మ విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే.
ఈ రెండు శాఖల్లోని ఉన్నతాధికారులకు ఈ స్కామ్‌తో సంబంధాలున్నట్లు భావిస్తున్నారు. ఇందులో భాగంగా అప్పటి డీఎంహెచ్‌వో రెడ్డి శ్యామలను విచారించినట్టు తెలిసింది. ఫిర్యాదుతో సంబంధం ఉన్నవారినందరినీ దర్యాప్తు బృందం విచారిస్తోంది. ఇప్పటికే రికార్డులను స్వాధీనం చేసుకుంది. కేసులో ప్రధానపాత్రధారి చింతపల్లి పీహెచ్సీ జూనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్‌తో పాటు, డీఎంహెచ్‌వో కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ నిర్మలాకుమారి,పాడేరు ఏడీఎంహెచ్‌వో కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ సన్యాసిరావు, ఆర్సీడీ ఆస్పత్రిలోని సీనియర్ అసిస్టెంట్ సింహాచలం, చింతపల్లి సబ్‌ట్రెజరీ అధికారి లోకేశ్వర్‌రావు, అకౌంటెంట్ అప్పలరాజులను అరెస్ట్ చేశారు.
మరో 8మంది ఉద్యోగులను అరెస్ట్ చేసి రూ. 42లక్షల నగదుతో పాటు 3కోట్లు విలువైన ఆస్తులను వెనక్కి తెప్పించగలిగారు.శ్యామల పాత్రపై ఆధారాలు: విచారణ సమయంలోనే అప్పటి డీఎంహెచ్‌వో రెడ్డి శ్యామల పాత్ర ఉన్నట్టు ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. సాధారణంగా పాడేరు అడిషనల్ డీఎంహెచ్‌వో కార్యాలయ నిధులు నేరుగా ఆ కార్యాలయానికి చెందిన ఏడీఎంహెచ్‌వో ఖాతాలోకే జమ చేస్తారు. ఆ నిధులతోనే ఉద్యోగుల జీత భత్యాలు, కాంటాక్ట్ ఉద్యోగుల వేతనాలు చెల్లిం చాలి.
ఇక్కడే కథ మలుపుతిరిగింది. ఆ డివిజన్లో ఏడీఎంహెచ్‌వో కార్యాలయంలోని డ్రాఫ్టింగ్ అధికారి నిర్మలాకుమారి, సీనియర్ అసిస్టెంట్ సింహాచ లం, చింతపల్లి సబ్‌ట్రెజరీ అధికారి లోకేశ్వర్రావులు కలిసి పాడేరు ఏడీఎంహెచ్‌వో కార్యాలయంలో కాకుండా విశాఖ డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి కాంటాక్ట్ ఉద్యోగుల జీతాలకు సంబంధించి రూ.3.9 కోట్లు డ్రా చేశా రు. డ్రాఫ్టింగ్ అధికారి చూసిన ఫైల్‌ను ఏవోకు పంపాలి ఆయన చూశాక ఫైల్ ను సూపరెంటెండెంట్ సంతకానికి పం పాలి. ఆయన చెక్ చేసి డీఎంహెచ్‌వో సంతకానికి పంపిస్తే అప్పుడు డబ్బులు డ్రా చేసుకునే అవకాశముం టుంది. ఇందుకు భిన్నంగా నిర్మలా కుమారి పె ట్టిన బిల్లులపై ఏవో, సూపరెంటెండెం ట్ సంతకాలు లేకుండానే డీఎంహెచ్‌వో సంతకాలు పెట్టేశారు. దీంతో ఆమె పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో శ్యామలను పోలీసులు నేడో, రేపో విచారించనున్నారు.
డీటీవో ఏం చేసినట్టు..?
ఈ కేసులో జిల్లా ఖజానాశాఖాధికారి పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2012 నుంచి 2014 మధ్యలో జరిగిన కుంభకోణంలో ఖజానాశాఖకు రావాల్సిన 774 వాంటింగ్ ఓచర్లు రాకుండానే నాలుగేళ్లు ఎలా ఆడిట్ చేయించారు? మిస్సయిన వోచర్ల గురించి డీటీవో ఎందుకు అడగలేదు. గతంలో ఒక ఓచర్ మిస్సయితేనే ఎస్టీవోను సస్పెండ్ చేయాలని ఆదేశించిన డీటీవో ఇప్పుడు భారీగా వోచర్లు మిస్సయితే ఎందుకు విచారణకు ఆదేశించలేదనే దానిపై అనుమానాలు వ్యకమవుతున్నాయి. కుంభకోణం ఇన్నేళ్ల నుంచి జరుగుతున్నా డీటీవో ఎందుకు విచారణ కొనసాగించలేదు. కాగా ప్రస్తుతం అరెస్టయిన అడిషనల్ డీఎంహెచ్‌వో స్వప్నకుమారి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.