కరోడ్‌పతి కాలేదు...కోర్టుకెక్కాడు..
సాక్షి, ముంబయి: మేమిచ్చిన రాయి పెట్టుకుంటే మూడు నెలల్లో కోటీశ్వరుడవుతావు..అలా కాకుంటే డబ్బు వాపస్ చేస్తాం అంటూ జ్యూవెలర్ చెప్పిన మాట నమ్మి సొమ్ము పోగొట్టుకున్నాడు ఓ వృద్థుడు. మూడు నెలలు దాటినా కోట్లు కనబడక పోయేసరికి రాయి తీసుకుని తన డబ్బు తనకివ్వాలని షోరూం నిర్వాహకులను కోరగా అందుకు వారు నిరాకరించడంతో బాధితుడు వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు.
అక్రమ పద్ధతుల్లో లావాదేవీ నిర్వహించారని బాధితుడికి 9 శాతం వడ్డీతో కలిపి అతను చెల్లించిన మొత్తం తిరిగి ఇవ్వాలని, పరిహారంగా రూ 25,000 చెల్లించాలని కోర్టు జ్యూవెలర్‌ను ఆదేశించింది. ముంబయికి చెందిన స్వర్ణ్ స్పర్శ్ అనే జెమ్‌స్టోన్ దుకాణంలో ఖండాలే అనే వ్యక్తి 2013లో నీలం జెమ్ స్టోన్‌ను కొనుగోలు చేశారు. కొద్ది రోజుల తర్వాత అదే షాపు నుంచి జ్యోతిష్యులు కుమారి ప్రాచి, శశికాంత్ పాండ్యా ఫోన్ చేసి సదరు రాయి మీకు సరిపడదు..పుష్యరాగ్, మాణిక్య రాళ్లను కొనుగోలు చేయాలని సూచించడంతో రూ 2.9 లక్షలకు వాటిని ఖండాలే కొనుగోలు చేశారు.
మూడు నెలల్లో తాము చెప్పినట్టు కోటీశ్వరుడు కానిపక్షంలో డబ్బు తిరిగి ఇచ్చస్తామని ఈ సందర్శంగా జ్యోతిష్యులు నమ్మబలికారు. అయితే మూడు నెలలు గడిచినా కోటీశ్వరుడు కాకపోవడంతో డీలా పడిన ఖండేలా తన డబ్బు తిరిగి ఇచ్చేయాలని షాపులో కోరారు. అందుకు నిర్వాహకులు నిరాకరించడంతో 2014 మేలో ఆయన కన్సూమర్ కోర్టును ఆశ్రయించారు.
నిబంధనల ప్రకారం నెల రోజుల్లోగా కొనుగోలు చేసిన వస్తువును తిరిగి ఇస్తేనే సొమ్ము చెల్లించడం జరుగుతుందని, బాధితుడు గడువులోగా రానందున డబ్బు వాపస్ చేయలేమని సంస్థ తేల్చిచెప్పింది. వాదనలు పరిశీలించిన కోర్టు మోసపూరిత హామీతో వస్తువు విక్రయించిన క్రమంలో బాధితుడికి 9 శాతం వడ్డీతో కలిపి రూ 3.2 లక్షలు చెల్లించాలని, పరిహారం కింద రూ 25,000 కోర్టు ఖర్చుల కింద రూ 5000 చెల్లించాలని జ్యూవెలర్‌ను ఆదేశించింది.