స్వావలంబన్ పేరిట స్వాహా
సాక్షి, మంచిర్యాల : స్వావలంబన్... అరవై ఏళ్లు దాటిన తర్వాత ఏ పనీ చేయకుండానే ప్రతి నెలా రూ.6 వేల నుంచి రూ.10వేలు పెన్షన్ పొందేలా 2010లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బృహత్తర పథకం. ఇప్పుడిది జిల్లాలో పక్కదారి పట్టింది. ఐదేళ్ల వరకు అవాంతరాలు లేకుండా.. సజావుగా కొనసాగిన ఈ పథకం అమలు సరిగ్గా ఏడాది క్రితం పేరు మారగానే అటకెక్కింది. కేంద్రంలో అధికారంలో వచ్చిన బీజేపీ సర్కార్.. ఆ పథకానికి అటల్ పెన్షన్ యోజనగా పేరు మార్చి.. కొత్తగా విధి విధానాలు మార్చడమే దీనికి కారణమైంది. పథకం ప్రారంభంలో ఢిల్లీలోని అలంకిత్ అసైన్మెంట్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న కేంద్రం.. ఏడాది క్రితమే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. పెన్షన్ పథకాన్ని నేరుగా బ్యాంకులకు అనుసంధానం చేసింది. దీంతో అప్పటి వరకు అలంకిత్ అసైన్మెంట్ లిమిటెడ్.. రాష్ట్రంలో తనకు అనుగుణంగా నియమించుకున్న ఎన్పీఎస్ సర్వీసెస్ నిర్వాహకులు జిల్లాలో సుమారు 3 వేల మంది చందాదారుల నుంచి వసూలు చేసిన రూ.30 లక్షలు కేంద్రానికి చెల్లించకుండా ఉడాయించారు.
డబ్బులు చెల్లించి పథకంలో చేరిన 60 రోజుల్లో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(పీఎఫ్ఆర్డీఏ) నుంచి చందాదారులకు చేరాల్సిన పర్మినెంట్ రిటైర్మైంట్ అకౌంట్ కార్డు(ప్రాన్) రాకపోవడంతో బిజినెస్ డెవలప్మెంట్ అధికారులు ఆరా తీశారు. ఫలితంగా.. జరిగిన మోసం వెలుగులోకి వచ్చింది. తాము ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక బీడీవోలు ఆందోళన చెందుతున్నారు. ఎన్పీఎస్ సర్వీసెస్ డబ్బులతో ఉడాయించిందని చందాదారులకు తెలిస్తే.. డబ్బుల కోసం వేధింపులు ఎక్కువవుతాయనే భయంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బీడీవోలు ముందుకురావడం లేదు. చివరకు.. లక్సెట్టిపేటకు చెందిన బీడీవో బిరుదుల సంతోష్‌కుమార్ తమకు జరిగిన మోసం గురించి.. ఎన్పీఎస్ సర్వీసెస్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ పథకం..
60 ఏళ్లు దాటిన అసంఘటిత రంగ కార్మికులకూ ప్ర భుత్వ ఉద్యోగుల(పదవీ విరమణ తర్వాత)లతో సమానంగా పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా స్వావలంబన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2014లో ప్రధానమంత్రి మోదీ పథకాన్ని స్వావలంబన్ యోజనగా మార్చారు. ఈ పథకంలో భాగంగా.. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఏడాదికి వెయ్యి రూపాయల చొప్పున చెల్లించిన అసంఘటిత రంగ కార్మికులకు 60 ఏళ్ల తర్వాత ప్రతీ నెల రూ.6 వేల నుంచి రూ.10 వే ల పెన్షన్ అందిస్తారు. ఇందులో పెన్షన్‌దారుడి వాటా రూ.వెయ్యి ఉంటే.. దానికి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అదనంగా మరో వెయ్యి రూపాయలు జమ చేస్తుంది. తర్వాత జమ అయిన ఈ నిధి సదరు పెన్షన్‌దారుడికి అందుతుంది. ఒకవేళ 60 ఏళ్లలోపే పథకం నుంచి వైదొలగాలన్నా.. పలు షరతులతో.. చెల్లించిన దాన్ని బట్టి పింఛన్ ఇస్తారు. చందాదారుడు మరణిస్తే.. జమ నిధిని అతడి వారసులకు అందజేస్తారు.
అయోమయం..
స్వావలంబన్ యోజన పథకాన్ని అటల్ పెన్షన్ యోజన పథకంగా మారుస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 2015లో నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో పలు మార్పులు చేసింది. అదే ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. స్వావలంబన్ యోజన పథకానికి 18-60 సంవత్సరాలలోపు ఉన్న వారు అర్హులుంటే అటల్ పెన్షన్ యోజనలో 18-40 ఏళ్లకు కుదించింది. దీంతో చందాదారులుగా చేరి.. పథకం ప్రారంభం నుంచి డబ్బులు చెల్లిస్తున్న 40 ఏళ్లకు పైబడిన వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 10 వేల మంది చందాదారులు పెన్షన్ పథకంలో సభ్యులుగా చేరగా... వారిలో 45 శాతం మంది 40 ఏళ్లకు పైబడిన వారే ఉండడం గమనార్హం. మరోపక్క.. పెన్షన్ స్కీం నుంచి వైదొలుగుదాం అనుకుంటే పథకాన్ని బ్యాంకులకు అనుసంధానం చేయడంతో బ్యాంకు మేనేజర్లూ గతంలో మీరు డబ్బులు చెల్లించిన ఎన్పీఎస్ సర్వీసెస్ నిర్వాహకులను సంప్రదించాలని చందాదారులకు సూచిస్తున్నారు. దీంతో ఇన్నాళ్లు తాము చెల్లించిన డబ్బులు వస్తాయో లేదోననే చందాదారులు ఆందోళన చెందుతున్నారు.
రోడ్డునపడ్డ బీడీవోలు
ఎన్పీఎస్ సర్వీసెస్.. చందాదారుల డబ్బులతో ఉడాయించడంతో జిల్లాలో పనిచేస్తున్న బిజినెస్ డెవలప్మెంట్ అధికారులు రోడ్డున పడ్డారు. ఎన్పీఎస్ సర్వీసెస్... మండలానికొకరి చొప్పున 52 మందితో పాటు పెద్ద మండలాలు, పట్టణాల్లో మొత్తం 60 మందిని నియమించుకుంది. నియామకం సమయంలో ఒక్కొక్కరి నుంచి రూ.30 వేలు అడ్వాన్సు తీసుకుంది. మూడు నెలల్లో కనీసం రెండొందల మంది చందాదారులను పథకంలో చేర్పించాలంది. ఇష్టం లేని వారు విధుల నుంచి వైదొలిగే అవకాశం కల్పించిన ఎన్పీఎస్.. బీడీవోలు ఇచ్చిన దాంట్లో రూ.25 వేలు తిరిగి ఇచ్చేందుకు సిద్ధమైంది. దీంతో కొన్నాళ్ల తర్వాత.. ఎన్పీఎస్పై అనుమానం వచ్చిన పలువురు బీడీవోలు తాము వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎన్పీఎస్ నిర్వాహకులు వారికి చెక్కులూ ఇచ్చారు. బీడీవోలు వాటిని తీసుకెళ్లి బ్యాంకులో వేశారు. దీంతో ఆ చెక్కులన్నీ బౌన్స్ అయినట్లు తేలింది.
రాష్ట్రంలో ఎన్పీఎస్ సర్వీసెస్‌కు బాధ్యతలు
ఢిల్లీలోని అలంకిత్ అసైన్మెంట్ లిమిటెడ్ అనే సంస్థతో కేంద్రం ఈ పథక నిర్వహణ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ రాష్ట్రంలో ఎన్పీఎస్ సర్వీసెస్‌కు ఈ బాధ్యతను అప్పగించింది. ఎన్పీఎస్ సర్వీసెస్ నిర్వాహకులు విజయ్‌కుమార్, సదానందం మండలానికొకరి చొప్పున అన్ని జిల్లాల్లో బిజినెస్ డెవలప్మెంట్ అధికారు(బీడీవో)లను, జిల్లాకో ఇన్చార్జిని నియమించుకున్నారు. బీడీవోలు మండలాల్లో తిరుగుతూ ప్రజలను పథకంలో చేర్పిస్తూ.. వారి నుంచి వసూలు చేసిన రూ.వెయ్యిని ఎన్పీఎస్ సర్వీసెస్‌కు చెల్లించి.. వెంటనే రశీదులు ఇచ్చేవారు. వసూలైన ఆ డబ్బులు రాష్ట్రస్థాయి నుంచి కేంద్రానికి అందిన 60 రోజుల్లోపు పీఎఫ్ఆర్డీఏ చందాదారుడి పేరిట పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ కార్డును జారీ చేస్తుంది.
న్యాయం చేయాలి..
2013 నుంచి స్వావలంబన్ పథకంలో పనిచేస్తున్న. ఇప్పటి వరకు వెయ్యి మంది పెన్షన్‌దారులను పథకంలో చేర్పించాను. అందులో 750 మందికి పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్(ప్రాన్) కార్డులూ ఇప్పించాను. మిగిలిన 250 నుంచి వసూలు చేసిన డబ్బులకు ఎన్పీఎన్ జారీ చేసిన రశీదులే ఇచ్చారు. డబ్బులు చెల్లించిన 60 రోజుల లోపు రావాల్సిన ప్రాన్ కార్డులు ఏడాది నుంచి రాకపోవడంతో ఏం చేయాలో తెలియడం లేదు. అసలు ఆ డబ్బులు పీఎఫ్ఆర్డీకి చేరనేలేదని తెలుసుకున్న. ఈ విషయంపై మంచిర్యాల కోర్టులో కేసు వేశాను. భవిష్యత్తు కోసం డబ్బులు జమ చేసుకుంటున్న వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు. కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో మోసపోయిన 250 మందికి వారి డబ్బులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- శంకర్ గౌడ్, బీడీవో, జైపూర్