2018లో బ్లాక్మనీ వివరాలు
లండన్: స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో నల్లధనం దాచిన భారతీయుల అకౌంట్ల వివరాలను తెలుసుకునేందుకు భారత్ 2018 వరకు వేచి చూడాల్సి ఉంటుంది. పన్ను ఎగవేత, మోసాలను అరికట్టేలా ప్రపంచ దేశాలు సహకరించుకునేందుకు ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) రూపొందించిన సమాచార మార్పిడి విధానం ‘ఆటోమాటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్’కు భారత్, స్విట్జర్లాండ్ సహా వంద దేశాలు ఆమోదించాయి. అయితే, ఈ సమాచార మార్పిడి విధానం భారత్ సహా 58 దేశాల్లో 2017లో అమల్లోకి వస్తుండగా, స్విట్జర్లాండ్తో పాటు మరో 34 దేశాల్లో 2018లో అమల్లోకి రానుంది.
అందువల్ల భారతీయుల స్విస్ బ్యాంక్ ఖాతాల వివరాలు ఈ విధానం ద్వారా భారత్కు 2018లోనే అందుతాయి. ఈ విధానం అమల్లోకి వచ్చిన తరువాత స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్న వారి అకౌంట్ నెంబర్, పేరు, చిరునామా, పన్ను గుర్తింపు సంఖ్య, వడ్డీ, డివిడెండ్, ఇన్సూరెన్స్ పాలసీల వివరాలు, షేర్లు, బాండ్ల వివరాలు.. మొదలైన సమాచారం అంతా భారత్ అందుకోగలదు. నల్లధనం కేసుల దర్యాప్తును వేగవంతం చేసే దిశగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) మరో కీలక చర్య తీసుకుంది. ఆర్థిక వ్యవహారాల నిఘా సంస్థ ‘సెంట్రల్ ఎకనమిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో(సీఈఐబీ)’ సహకారం కూడా తీసుకోవాలని నిర్ణయించింది.