హైకోర్టు విభజనపై త్వరగా నిర్ణయం తీసుకోండి
* కేంద్ర హోంమంత్రికి టీ అడ్వొకేట్ జేఏసీ, బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధుల వినతి
* సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామన్న రాజ్‌నాథ్
సాక్షి, న్యూఢిల్లీ: హైకోర్టు విభజనపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని అడ్వొకేట్ జేఏసీ, బీజేపీ లీగల్‌సెల్ ప్రతినిధి బృందం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర విభజన జరిగి 14 నెలలు దాటుతున్నా ఏపీ, తెలంగాణకు వేర్వేరు హైకోర్టులు లేకపోవడం వల్ల కేసులకు సంబంధించి అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు.
తెలుగు ప్రజల మధ్య మనస్పర్ధలను దూరం చేయడానికి సామరస్య పూర్వకంగా హైకోర్టును విభజన చేయాలని విన్నవించారు. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, టీజేఏసీ చైర్మన్ కోదండరాం నేతృత్వంలో టీ అడ్వొకేట్ జేఏసీ, బీజేపీ లీగల్‌సెల్ ప్రతినిధి బృందం మంగళవారం సాయంత్రం నార్త్‌బ్లాక్‌లో హోంమంత్రి రాజ్‌నాథ్‌తో భేటీ అయింది. హైకోర్టు విభజన ఆవశ్యకతను మంత్రి దత్తాత్రేయ, కోదండరాం, న్యాయవాదులు వివరించారు.
ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసనమండలి చేసిన ఏకగీవ్ర తీర్మానాలతో పాటు పార్లమెంటు లోపల, బయట అనేక సందర్భాల్లో హైకోర్టు విభజనపై బీజేపీ హామీలు ఇచ్చిన విషయాన్ని రాజ్‌నాథ్ దృష్టికి తీసుకెళ్లారు. భేటీ అనంతరం మంత్రి దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడుతూ హైకోర్టు విభజనపై మంత్రి రాజ్‌నాథ్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడతో మాట్లాడి సాధ్యాసాధ్యాలను తెలుసుకుంటానని, అవసరమైతే చట్టసవరణ ప్రతిపాదనలపై కూడా చర్చిస్తామని రాజ్‌నాథ్ చెప్పారన్నారు.
మనస్పర్ధలకు మమ్మల్ని బాధ్యులను చేయొద్దు: కోదండరాం
హైకోర్టు విభజన ప్రక్రియను తాత్సారం చేయడం వల్ల ప్రజల మధ్య ఉత్పన్నమయ్యే మనస్పర్ధలకు తమని బాధ్యులను చేయొద్దని రాజ్‌నాథ్‌కు స్పష్టం చేశామని టీజేఏసీ చైర్మన్ కోదండరాం చెప్పారు. హైకోర్టు విభజన ప్రక్రియను పూర్తి చేయడానికి ముఖ్యభూమిక నిర్వహించాలని రాజ్‌నాథ్‌ను కోరామన్నారు. హైకోర్టు విభజనపై ప్రధాన న్యాయమూర్తి సేన్ గుప్తా ఇచ్చిన తీర్పు తేనెతుట్టెను కదిపినట్టైందన్నారు.
రాజ్యాంగ బద్ధంగా హైకోర్టు ఏర్పాటు అధికారాన్ని సీఎంలకు బదలాయించే విధంగా తప్పుడు తీర్పు ఉందన్నారు. ఉమ్మడి రాజధానిలో రెండు హైకోర్టులు వద్దంటే, అసెంబ్లీ, సచివాలయం, ఇతర విభాగాలు కూడా ఉండవద్దని ఎవరైనా కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉందని, తద్వారా కొత్త సంక్షోభం వస్తుందన్నారు. టీఅడ్వొకేట్ జేఏసీ కన్వీనర్ రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ, బీజేపీ లీగల్‌సెల్ నేత రామచంద్రారావు పాల్గొన్నారు.